ఎక్సైజ్ సూపరిండెంట్‌పై ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన సంపత్ గౌడ్
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కరడ్‌పల్లి గ్రామానికి చెందిన సంపత్ గౌడ్, ఎక్సైజ్ శాఖ సూపరిండెంట్ హనుమంతరావుపై ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. రెడ్డిపేట్ గ్రామానికి చెందిన స్వామి గౌడ్ నకిలీ ఓటరు ఐడి, ధృవ పత్రాలను సృష్టించి కరడ్‌పల్లి గ్రామంలో కల్లు దుకాణం లైసెన్సు పొందాడని ఆరోపించాడు.
ఈ అంశంపై జిల్లా ఎక్సైజ్ అధికారులకు పలు మార్లు ఆధారాలతో ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటివరకు లైసెన్సు రద్దు చేయలేదని పేర్కొన్నాడు. పరిస్థితిని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, కలెక్టర్ తక్షణమే లైసెన్సు రద్దు చేయాలని సూపరిండెంట్‌ను ఆదేశించినప్పటికీ ఆయన పట్టించుకోవడంలేదని తెలిపాడు.
గత వారం సూపరిండెంట్‌ను కలిసిన సమయంలో, రెసిడెన్షియల్ సర్టిఫికెట్ తీసుకురావాలని, అందించిన తర్వాత లైసెన్సు రద్దు చేస్తానని చెప్పినప్పటికీ, ఇప్పుడు మళ్లీ మాట మార్చాడని వెల్లడించాడు. ఈ నేపధ్యంలో మరోసారి ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.స్వామి గౌడ్ నకిలీ పత్రాలతో పొందిన లైసెన్సును రద్దు చేయాలని జిల్లా యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.