లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి

*లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి*

*హైదరాబాద్, ఏప్రిల్ 22*

హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రేపు (బుధవారం) ఉదయం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగనుంది. బ్యాలెట్ పద్దతిలో ఎన్నికల జరుగనుంది. ఏప్రిల్ 25న (శుక్రవారం) కౌంటింగ్ జరుగనుంది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే పోలింగ్, కౌంటింగ్ నిర్వహించనున్నారు. కౌంటింగ్ కోసం ఓ మైక్రో అబ్జర్వర్, ఓ కౌంటింగ్‌ సూపర్‌వైజరు, ఇద్దరు సహాయకులతో ఓ బృందాన్ని నియమించారు. ఎన్నికల కోసం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒకటి కార్పొరేటర్లకు, మరొకటి ఎక్స్ ఆఫీషియో సభ్యులకు పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎం, బీజేపీ పార్టీలు పోటీలో ఉన్నాయి.

ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హాసన్, బీజేపీ అభ్యర్థి గా గౌతమ్ రావు బరిలో ఉన్నారు. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా హైదరాబాద్ జిల్లాకు చెందిన జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫీషియో మెంబర్స్‌గా జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం ఓటర్లు 112, కార్పొరేటర్లు 81,ఎక్స్ ఆఫీషియో సభ్యులు 31 మంది ఓటు వేయనున్నారు.

పార్టీల బలాబలాలు

ఈ ఎన్నికల్లో పోటీ చేయబోయే పార్టీ బలాబలాను ఇప్పుడు చూద్దాం. ఎంఐఎం పార్టీకి 41 కార్పొరేటర్లు, 9 ఎక్స్ ఆఫీషియో సభ్యులు కలిపి మొత్తం 50 మంది ఉన్నారు. అలాగే బీజేపీకి 18 మంది కార్పొరేటర్లు, 6గురు ఎక్స్ ఆఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 24 మంది ఉన్నారు. ఇటు కాంగ్రెస్‌కు ఏడుగురు కార్పొరేటర్లు, ఏడుగురు ఎక్స్ ఆఫీషియో సభ్యులు సహా మొత్తం 14 మంది ఉన్నారు. బీఆర్‌ఎస్‌కు 15 మంది కార్పొరేటర్లు, 9 మంది ఎక్స్ ఆఫీషియో సభ్యులు కలిపి మొత్తం 24మంది ఉన్నారు. సరిపడా సంఖ్యా బలం లేకపోయినప్పటికీ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తొలిసారి బరిలో నిలిచింది. ఇరవై రెండేళ్లుగా ఏకగ్రీవం అవుతున్న హైదరాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అవుతున్న విషయం తెలిసిందే. 22 ఏళ్ళ తర్వాత హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. దీంతో ఈ ఎన్నికల్లో ఎవరు నెగ్గుతారు అనే ఉత్కంఠ నెలకొంది.

కాగా.. మే 1న ప్రస్తుత ఎమ్మెల్సీ ప్రభాకర్ పదవీకాలం ముగియనుండటంతో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు మార్చి 24న ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 28న నోటిఫికేషన్ వచ్చింది. ఏప్రిల్ 4 వరకు నామినేషన్లను స్వీకరించడం జరిగింది. ఏప్రిల్ 7న నామినేషన్లను పరిశీలించగా.. ఏప్రిల్ 9 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించారు. ఇక ఏప్రిల్ 23 పోలింగ్, ఏప్రిల్ 25న ఓట్ల లెక్కింపు జరుగనుంది.

Join WhatsApp

Join Now