ప్రజా సమస్యల పరిష్కారానికి హక్కుల సాధనకు గలమెత్తి చట్టసభలకు వన్నెతెచ్చిన నేత కామ్రేడ్ ఓంకార్

*ప్రజా సమస్యల పరిష్కారానికి హక్కుల సాధనకు గలమెత్తి చట్టసభలకు వన్నెతెచ్చిన నేత కామ్రేడ్ ఓంకార్*

*ప్రజాస్వామ్య పౌర హక్కుల పరిరక్షణకు ఉద్యమించాలని పిలుపు*

*ఎంసీపీఐ(యూ) పొలిట్ బ్యూరో సభ్యుడు ఉపేందర్‌రెడ్డి*

*జమ్మికుంట జులై 5 ప్రశ్న ఆయుధం*

ప్రజా సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు తన గళమెత్తి చట్టసభలకు వన్నెతెచ్చిన నేత, నేటి తరానికి ఆదర్శనీయులు కామ్రేడ్ ఓంకార్ అని ఎంసీపీఐ(యూ) పొలిట్ బ్యూరో సభ్యుడు వల్లెపు ఉపేందర్‌రెడ్డి అన్నారు. శనివారం జమ్మికుంట పట్టణంలోని కొత్తపల్లిలో ‘పౌరహక్కుల పరిరక్షణ-ఓంకార్ పాత్ర’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎమర్జెన్సీ కాలంలో ఆనాటి సీఎం జలగం వెంగళరావు హయాంలో ఎన్‌కౌంటర్ల పేరుతో అనేక మంది నక్సలైట్లను కాల్చి చంపారని వివరించారు. అందులో పోట్ల రామనర్సయ్యను అక్రమంగా నర్సంపేట పాకాల అడవులలో చిలుకలగట్టు గుట్టకు తీసుకెళ్లి చంపేశారని, ఖమ్మం అడవులలో సుమారు 200 మంది యువకులను కాల్చి చంపేశారని పేర్కొన్నారు. ఆ సందర్భంలో పుచ్చలపల్లి సుందరయ్య, ఓంకార్ అసెంబ్లీలో ఈ విషయాలు లేవనెత్తారని గుర్తుచేశారు. నక్సలైట్ల సిద్ధాంతాలు, విధానాలు వేరైనంత మాత్రాన మనుషులను పట్టుకొని కాల్చి చంపే హక్కు మీకెవరిచ్చారని ఆనాటి ప్రభుత్వాన్ని ప్రశ్నించారని చెప్పారు. గవర్నర్ ప్రసంగంపై శాంతిభద్రతలపై చర్చకు పట్టుబట్టి వాదించి బూటకపు ఎన్‌కౌంటర్లలో చంపిన ఘటనపై విశ్రాంత న్యాయమూర్తి భార్గవతో కమీషన్ వేయించి, సదరు కమిటీ ముందు సాక్షులను తీసుకొచ్చి సాక్ష్యం ఇప్పించడంలో ఓంకార్ కీలకపాత్ర పోషించారని స్పష్టం చేశారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ సర్కారు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను ఉపయోగించి అక్రమంగా ప్రతిపక్ష పార్టీ నాయకులను జైళ్లలో పెడుతున్నదని విమర్శించారు. ఆదివాసీలను కాల్చి చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ సంపద కార్పొరేట్ పెట్టుబడిదారులకు కట్టబెట్టుటకు, దోచి పెట్టుటకు అనేక కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కామ్రేడ్ ఓంకార్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా జూన్ 12 నుంచి జూలై 11 వరకు ఓంకార్ చూపిన మార్గంలో ప్రజాస్వామ్య, పౌరహక్కుల పరిరక్షణకు ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంసీపీఐ(యూ) ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి గడ్డం శ్రీకాంత్, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య రాష్ట్ర కమిటీ సభ్యురాలు వి.సరోజన, పిట్టల తిరుపతి, మదనయ్య, పిట్టల సుజాత, స్వర్ణలత, కళావతితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now