కాంగ్రెస్ అప్పు లక్షన్నర కోట్లు..
కార్పొరేషన్ల లోన్లు కూడా కలిపితే ఇంకా చాలా ఎక్కువ
పదిహేను నెలల్లో రేవంత్ సర్కారు చేసిన అప్పు అక్షరాలా లక్షా యాభై రెండు వేల కోట్లు!
అప్పులు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ సరికొత్త రికార్డు
ఎఫ్‌ఆర్బీఎం పరిధిని దాటిమరీ రుణ సేకరణ
రాష్ట్రంపై నెలకు రూ.10వేల కోట్లకుపైగా పడిన భారం
అప్పులతో ఒక్క ప్రాజెక్టునూ చేపట్టని ప్రభుత్వం తీరు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సగటున రోజుకు రూ.333 కోట్ల చొప్పున ప్రజలపై అప్పులభారం మోపుతున్నది. గత 15 నెలల కాలంలో నెలకు సుమారు రూ.10వేల కోట్ల చొప్పున ఇప్పటికి రూ.1,52,918 కోట్ల అప్పు చేసింది.
అసమర్థ పాలన, అర్థరహిత విధానాలతో ఇప్పటికే అనేక ‘రికార్డులు’ మూటగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. నేడు మరో కొత్త రికార్డు సృష్టించనున్నది. అదేదో ప్రజలకు మంచి చేసే విషయంలో కాదు.. అప్పులు తీ సుకోవడంలో రికార్డు సాధించనుంది. ఆర్బీఐ నుంచి మంగళవారం బాండ్ల వేలం ద్వారా రూ.3వేల కోట్ల మేర అప్పులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం గత 15 నెలల్లో అధికారికంగా చేసిన అప్పులు లక్షన్నర కోట్లు దాటనున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 460 రోజుల పాలనలో చేసిన అప్పు అక్షరాల రూ.1,52,918 కోట్లకు చేరుకోనున్నది. అంటే.. నెలకు రాష్ట్ర ప్రజలపై రూ.10వేల కోట్లకుపైగా అప్పుల భారం మోపుతున్నదన్నమాట. గత నాలుగు నెలల్లో కార్పొరేషన్ల ద్వారా సేకరించిన రుణాలు కూడా కలిపితే ఈ మొత్తం మరింత పెరుగుతుందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.
మొదటి రోజు నుంచీ అప్పులే..
కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్ 7వ తేదీ నుంచి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ప్రభుత్వం రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చిందంటూ ఎన్నికల సమయంలో విమర్శించిన కాంగ్రెస్.. తాము అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే అప్పులు చేయడం మొదలు పెట్టింది. అవకాశం ఉన్న ప్రతిచోట ఎడాపెడా అప్పులు చేస్తూ ప్రజలపై భారం మోపుతూనే ఉన్నది. ఓవైపు ఆర్బీఐ నుంచి బాండ్ల ద్వారా రుణాలు సేకరిస్తూ, మరోవైపు కార్పొరేషన్ల ద్వారా కూడా అప్పులు చేస్తున్నది. ఇంకోవైపు భూములు తనఖా పెడుతూ రూ.వేల కోట్లు సేకరిస్తున్నది.
2023 డిసెంబర్ నుంచి నేటివరకు ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రూ.69,827 కోట్ల రుణాలు సమీకరించింది
ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన గణాంకాల ప్రకారమే.. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి రాకుండా నిరుడు నవంబర్ వరకు కార్పొరేషన్లు/ఎస్‌పీవీల ద్వారా రూ.61,991 కోట్లు అప్పు తీసుకున్నది.
ఎలాంటి గ్యారెంటీలు ఇవ్వకుండా రూ. 10,100 కోట్ల రుణాలు సేకరించింది.
నిరుడు డిసెంబర్‌లో టీజీఐఐసీ భూములను కుదువ పెట్టి ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ.10 వేల కోట్ల పొందింది.
ఇటీవలే హడ్కో నుంచి రూ.వెయ్యి కోట్లు రుణం తీసుకున్నది.
ఇవన్నీ కలిపితే అధికారికంగా ఇప్పటివరకు చేసిన అప్పులే రూ.1,52,918 కోట్లకు చేరుకోనున్నాయి.
నిరుడు డిసెంబర్ నుంచి ఇప్పటివరకు నాలుగు నెలల్లో కార్పొరేషన్ల ద్వారా సేకరించిన రుణాలు కలిపితే ఈ మొత్తం ఇంకా పెరుగుతుందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.
అధికారిక గణాంకాలు పరిశీలించినా.. 15 నెలలుగా ప్రభుత్వం సగటున నెలకు చేసిన అప్పు రూ.10వేల కోట్లకుపైనే.
ఈ లెక్కన 459 రోజుల్లో రోజుకు సగటున రూ.333 కోట్లకుపైగా అప్పు చేసిందని విశ్లేషకులు చెప్తున్నారు.
ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని దాటి రుణాలు
కేంద్ర ప్రభుత్వం విధించిన ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని దాటి రాష్ట్ర సర్కారు అప్పులు చేసింది. వాస్తవానికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని కేంద్ర ప్రభుత్వం రూ.49,255 కోట్లుగా విధించింది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తొలి మూడు త్రైమాసికాల్లో (నిరుడు ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు) రూ.41,759 కోట్ల రుణం తీసుకున్నది. అంటే.. కేంద్రం అనుమతించిన అప్పులో జనవరి నాటికి ఇంకా రూ.7,500 కోట్లు మాత్రమే మిగిలింది. కానీ ప్రభుత్వం ప్రస్తుత చివరి త్రైమాసికంలో (జనవరి, ఫిబ్రవరి, మార్చిల్లో) ఏకంగా రూ.30 వేల కోట్ల అప్పు తీసుకుంటామని ఆర్బీఐకి ఇండెంట్లు పెట్టింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అడిగినంత అదనపు రుణం ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించింది. ఫలితంగా కొన్ని వారాలపాటు ఆర్బీఐ బాండ్ల వేలంలో తెలంగాణ పాల్గొనలేదు. చివరగా ప్రభుత్వ పెద్దలు ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలను కోరడంతో కొంత ఉపశమనం కల్పించినట్టు చెప్తున్నారు. దీంతో ఇప్పటికే ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని దాటి ఆర్బీఐ నుంచి రూ.20 వేల కోట్లు అదనంగా అప్పు చేశారు. మరో రెండు వారాల్లో ఇంకా ఎంత అప్పు చేస్తారోనని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏం సాధించినట్టు?
రాష్ట్ర ప్రభుత్వం చేసిన లక్షన్నర కోట్లతో ఏం చేసిందనేది ప్రశ్నార్థకంగా మారిందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. గత 15 నెలల్లో ఒక్క భారీ ప్రాజెక్టునైనా చేపట్టిందా? అని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులతో కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి వంటి భారీ సాగునీటి ప్రాజెక్టులు, భారీ భవనాలు, కాలేజీలు.. ఇలా అనేక ఆస్తులు సృష్టించిందని గుర్తు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రూ.లక్షన్నర కోట్ల రుణంతో రాష్ర్టానికి సృష్టించిన ఆస్తి ఒక్కటి కూడా లేదని మండిపడుతున్నారు. పోనీ సంక్షేమ పథకాలైనా సక్రమంగా అమలవుతున్నాయా? అంటే అదీ లేదని చెప్తున్నారు. కనీసం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నారని మండిపడుతున్నారు.
2023 డిసెంబర్ నుంచి మంగళవారం వరకు అప్పులు ఇలా..
ఆర్బీఐ నుంచి తీసుకున్నవి – రూ.69,827 కోట్లు
కార్పొరేషన్లు/ఎస్‌పీవీల ద్వారా సేకరించినవి – రూ.61,991 కోట్లు (గత నవంబర్ నాటికి)
గ్యారెంటీలు ఇవ్వకుండా సమీకరించినవి – రూ.10,100 కోట్లు
టీజీఐఐసీ భూములను కుదువ పెట్టి తీసుకున్నవి – రూ.10 వేల కోట్లు
హడ్కో నుంచి తీసుకున్న రుణం – రూ.వెయ్యి కోట్లు
మొత్తం అప్పు – రూ.1,52,918 కోట్లుకాంగ్రెస్ అప్పు.. లక్షన్నర కోట్లు