కాంగ్రెస్ ఆశలు గల్లంతు..!!

కాంగ్రెస్ ఆశలు గల్లంతు..

16నెలలుగా మంత్రివర్గంలో ప్రాతినిథ్యం దొరకని గ్రేటర్‌

నిన్నటిదాకా ఎమ్మెల్సీ టు క్యాబినెట్‌ ఆశల్లో ఉన్న నేతలు

తెరపైకి అంజన్‌, మధుయాష్కీ, ఫిరోజ్‌ఖాన్‌, దానం, అజారుద్దిన్‌ పేర్లు చక్కర్లు

ఎక్కని గడప… దిగని గడప.. అన్నట్లుగా శతవిధాలా ప్రయత్నం

అధిష్ఠానం కరుణించకపోవడంతో తీవ్ర నిరాశలో ఆశావహులు

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు! అన్నట్టుగా.. నిన్నటిదాకా గ్రేటర్‌ కాంగ్రెస్‌ నేతల గురి ఇట్లనే ఉండె. ఆషామాషీ కాదు.. ఎమ్మెల్సీ టు క్యాబినెట్‌ దిశగా.. పైకి ఎమ్మెల్సీ ప్రయత్నాలైనా.. ఆ కొమ్మ పట్టుకొని మంత్రివర్గం దాకా ఎక్కాలని తెగ పోరాడారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎక్కే గడప.. దిగే గడప.. అన్నట్లు ఎవరిస్థాయిలో వాళ్లు అన్ని అస్ర్తాలూ సంధించారు. అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు అందివచ్చిన దారులన్నింటినీ వినియోగించారు. చివరకు కొందరు బహిరంగ వేదికలపై ‘ఎమ్మెల్సీ టు క్యాబినెట్‌’ ఆకాంక్షను తమకు తోచిన కోణంలో వ్యక్తం చేయడమే కాదు.. పరోక్షంగా పార్టీకి హెచ్చరికలు కూడా చేశారు. కానీ ఆశలు గల్లంతయ్యాయి. పార్టీ అధిష్ఠానం రెండ్రోజుల కిందట ఇచ్చిన ఎమ్మెల్సీల జాబితాలో అసలు గ్రేటర్‌కు స్థానమే దక్కకపోవడంతో ‘అయినా.. అనుకున్నాయన్ని జరుగుతయా?’ అని నిట్టూరుస్తున్నారు. మరి.. ఇంత జరిగినా ఎవరూ గళం మాత్రం విప్పడం లేదు. కారణం.. ‘నాకు దక్కకున్నా సరే.. గ్రేటర్‌లోని ఇతర ఆశావహులకైతే దక్కలేదు చాలు..’ అనుకుంటున్నారు. హమ్మయ్య.. ఇప్పటికైతే మంత్రివర్గంలో గ్రేటర్‌ బెర్త్‌ ఖాళీనే! మరో అవకాశం రాకపోదా!! అని తమకు తాము సర్ది చెప్పుకుంటున్నారు. మరో ఏడాది దాకా ఖాళీ అయ్యే ఎమ్మెల్సీలు లేకపోవడంతో వాళ్లకు నిద్దుర కరువైన దుస్థితి నెలకొంది.

కాంగ్రెస్‌ వచ్చింది.. గ్రేటర్‌ ప్రాతినిథ్యం పోయింది..!

ఎలాగైనా ఎమ్మెల్సీ దక్కించుకుని మంత్రివర్గంలో బెర్త్‌ ఖరారు చేసుకోవాలని ఆశపడిన గ్రేటర్‌ ఆశావహులకు నిరాశే మిగిలింది. ఎమ్మెల్యేల కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌ వచ్చింది మొదలు.. గ్రేటర్‌లోని పలువురు నేతలు జాబితాలో చోటు దక్కించుకునేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్గంలో ఇప్పటిదాకా గ్రేటర్‌ ప్రాతినిథ్యం లేకుండా పోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఆ పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు. ఆపై కంటోన్మెంట్‌కు వచ్చిన ఉప ఎన్నికలో శ్రీగణేష్‌ను విజయం వరించింది. కానీ ఆయన అప్పటికప్పుడు బీజేపీ నుంచి వచ్చి టికెట్‌ దక్కించుకున్న ప్యారాచూట్‌ నేతనే. దీంతో మంత్రివర్గంలో గ్రేటర్‌ ప్రాతినిథ్యం మార్గం సుగమం కానట్లేనని పార్టీ నేతలే కుండబద్దలు కొడుతున్నారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మొదలు గత పదేండ్ల బీఆర్‌ఎస్‌ హయాంలోనూ రాష్ట్ర మంత్రివర్గంలో గ్రేటర్‌ ప్రాతినిథ్యానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. కేసీఆర్‌ ప్రభుత్వంలోని మంత్రివర్గంలో తొలి దఫా ఇద్దరు… రెండో దఫాలో ఏకంగా ముగ్గురికి ప్రాతినిథ్యం కల్పించారు. అలాంటిది కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్యాబినెట్‌లో గ్రేటర్‌ ప్రాతినిథ్యమే లేకుండా పోవడాన్ని పార్టీవర్గాలే పెద్ద లోటుగా భావిస్తున్నాయి. అందుకే గ్రేటర్‌ పరిధిలోని కీలక కాంగ్రెస్‌ నేతలు పలువురు గత కొంతకాలంగా తీవ్రంగా చమటోడ్చినా ఫలితం దక్కలేదు.

ఒక్కొక్కరిది ఒక్కో వ్యథ!

గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌ పరిధిలో కాంగ్రెస్‌ పార్టీకి ప్రాతినిథ్యం దక్కకపోవడంతో మంత్రివర్గంలోనూ ప్రాతినిథ్యం లేకుండా పోయింది. ఈ క్రమంలో ప్రజాక్షేత్రంలో విజయం వెక్కిరించినా.. కనీసం అధిష్ఠానం కనికరిస్తే వయా ఎమ్మెల్సీ మంత్రివర్గంలో చోటు దక్కించుకుని బుగ్గకారులో తిరగాలని పలువురు నేతలు తెగ కలలు కన్నారు. ఇందులో భాగంగా ఇటీవల వచ్చిన ఐదు ఎమ్మెల్సీ స్థానాల నోటిఫికేషన్‌తో వాళ్ల కలలకు రెక్కలొచ్చినట్లయ్యాయి. అందుకే అనేక రకాలుగా అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.

ఎల్బీనగర్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయిన టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ ఈ జాబితాలో ముందు వరుసలోనే ఉన్నారు. ఇక్కడి ‘ముఖ్య’నేతతో అంతగా సత్సంబంధాలు లేకున్నా హస్తిన నుంచి నరుక్కు వచ్చే అనుభవం, సామర్థ్యం ఆయనకుంది. ఈ క్రమంలో ఎల్బీనగర్‌ గ్రేటర్‌ పరిధిలోకి వస్తున్నందున ఎమ్మెల్సీగా ‘ఒక్క ఛాన్సు’ ఇస్తే ఇట్టే మంత్రివర్గంలో బెర్త్‌ ఖరారు చేసుకోవచ్చని ఆశించారు. కానీ ఏకంగా రాహుల్‌ గాంధీతో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం వచ్చినప్పటికీ జాబితాలో మాత్రం అదృష్టం వరించలేదు.

మాజీ ఎంపీ, పార్టీ సీనియర్‌ నేత అంజన్‌కుమార్‌ యాదవ్‌.. మనసులోని కోరికను ఎప్పుడూ దాచుకున్న దాఖలాలు లేవు. తనయుడికి చిన్న వయసులోనే రాజ్యసభ భాగ్యం కలిగినప్పటికీ.. తనలోని మంత్రివర్గ కోరిక మాత్రం కుదురుగా ఉండనీయడంలేదు. అందుకే తనయుడు అనిల్‌కుమార్‌కు ఎంపీ అవకాశం ఇచ్చినా సరే! తన కోటా తనదేనంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ స్థానాల నోటిఫికేషన్‌ రాకముందే బహిరంగంగానే తన మనసులోని మాటను అనేకసార్లు వెల్లడించడమే కాకుండా గతంలో తనకొచ్చిన అవకాశాలు ఎలా వచ్చాయి.. గడపదాకా వచ్చిన అవకాశాలను ఎవరు కొల్లగొట్టారనేది కూడా ఏకరువు పెట్టారు. ఒక దశలో ఒక సామాజిక వర్గాన్ని సైతం లక్ష్యంగా ఎంచుకున్నారు. ఎందుకంటే ఎమ్మెల్సీ అవకాశాల్లో వాళ్లేమైనా మోకాలడ్డుతారేమోనని పరోక్షంగా హెచ్చరించారు. కానీ అధిష్ఠానం మనసులో సమీకరణాలన్నీ వేరేవిధంగా ఉండటంతో అంజన్‌కుమార్‌ పాచికలన్నీ వృథాగానే మిగిలిపోయాయి.

మైనార్టీ కోటాలో తమకు అవకాహస్తం ఒడిలో ఒదిగిపోయారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో ‘ముఖ్య’నేత పిలిచి మరీ పక్కనే తిప్పుకోవడంతో తన దశ మారిందనుకున్నారు. కానీ ఏదో ఒక సినిమాలో అన్నట్లు.. దురదృష్టం బెడ్‌రూంలో దుప్పటి తన్నుకుని పడుకుంటే ఏం చేస్తాం?! అన్నట్లు సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానంలో ఓటమి వెక్కిరించడమే కాకుండా క్యాబినెట్‌ కలలు కరిగిపోయాయి. చివరకు నియోజకవర్గంలో అధికారులు సైతం తన మాట వినకపోవడంతో ప్రతిసారీ ‘సీఎంతో మాట్లాడతా’ అని సర్దుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Join WhatsApp

Join Now

Leave a Comment