కాంగ్రెస్ ప్రభుత్వం ఫోర్త్ సిటీ పేరుతో చేసిన ప్రకటన వెనుక పెద్ద ఎత్తున భూదందా కొనసాగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని గుర్రంగూడలో బోనాల ఉత్సవాలకు హాజరైన ఆయన ఈ కామెంట్స్ చేశారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ నేతలు వేల ఎకరాలను ముందుగానే సేకరించి రియల్ ఎస్టేట్ దందా చేస్తూ వేల కోట్ల ఆస్తులను పోగేసుకునేందుకు సిద్ధమయ్యారన్నారు. మహేశ్వరం కాంగ్రెస్ స్థానిక కాంగ్రెస్ నాయకుడికే భూములను సేకరించే బాధ్యతను అప్పగించారని సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనివల్ల కాంగ్రెస్ నేతలకు తప్ప ప్రజలకు పెద్దగా ప్రయోజనం లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించేందుకు భూ దందాను తెరపైకి తెస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ బాటలో నడుస్తున్నారని.. బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని హెచ్చరించారు సంజయ్. ధరణి, భూముల అన్యాక్రాంతంపై శ్వేతపత్రం విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబ భూ దోపిడీపై చర్యలు ఏవని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.