వెంకంపేట రోడ్డులో గోతులను, వైకియం కాలనీ వద్ద రోడ్డుపై ఉన్న గోడను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

*వెంకంపేట రోడ్డులో గోతులను, వైకియం కాలనీ వద్ద రోడ్డుపై ఉన్న గోడను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు*

పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 15( ప్రశ్న ఆయుధం న్యూస్ )దత్తి మహేశ్వరావు

పార్వతీపురం పట్టణానికి అతి సమీపంలో ఉన్న రోడ్డులో గోతులు, రోడ్డు మీద గోడ కనిపించదా…? అని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఓబిసి పార్వతీపురం మన్యం జిల్లా చైర్మన్ వంగల దాలి నాయుడు, సాలూరు ఇన్చార్జ్ గేదెల రామకృష్ణ, పార్వతీపురం మండల అధ్యక్షులు తీళ్ల గౌరీ శంకరరావు తదితరులు పార్వతీపురం పట్టణము నుండి వెంకంపేట, వైకేయం కాలనీ మీదుగా విశాఖపట్నం వెళ్లే రహదారిలో గోతులను, రోడ్డుపై గోడను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం రద్దీగా ఉండే పార్వతీపురం నుండి వెంకంపేట మీదుగా ఒడిశాకు, పార్వతీపురం నుండి అడ్డాపుశీల గ్రామం మీదుగా వెళ్లే గోతులను, వై.కె.యం. అఫీషియల్ కాలనీ వద్ద గల రోడ్డుపై నిర్మించిన గోడను సంబంధిత అధికారులు పాలకులు పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. కల్వర్టు కూలి సుమారు మూడేళ్లు గడుస్తున్నా గతంలో వైసిపి, ఇప్పుడు కూటమి పట్టించుకోలేదన్నారు. ఎన్నికల సమయంలో కూటమి పాలకులు ఆయా రోడ్లలో గోతులను, ఎన్నికల హామీలలో ఒకటిగా చూపించి అధికారంలోకి వచ్చారన్నారు. వైసిపి గోతులను, గోడను పట్టించుకోలేదని అప్పట్లో ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక కూటమి పాలకులు కూడా తక్కువ కాదని, పాలనలో వారికి తీసిపోమని నిరూపిస్తున్నారని ఆరోపించారు. ఇదే రహదారిలో నిత్యం కూటమి నాయకులు, కార్యకర్తలు, జిల్లా కలెక్టర్ తో సహా పెద్ద చిన్నా అధికారులు, సిబ్బంది రాకపోకలు సాగిస్తున్నారన్నారు. వారికి రోడ్డులో గోతులు, రోడ్డుపై గోడ కనీసం కనిపించకపోవడం హాస్యాస్పదమన్నారు. ఆయా గోతుల రోడ్డులో తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడం ప్రజల దౌర్భాగ్యమన్నారు. గత సంక్రాంతికి రోడ్డులో గోతులు లేకుండా చేస్తామని ప్రకటనలు గుప్పించిన కూటమి పాలకులు ఉగాది పోయినా వాటిని పట్టించుకోవడం లేదన్నారు. అలాగే పులిగుమ్మి రహదారి కూడా గోతులమాటమైందన్నారు. అంతర్రాష్ట్ర రహదారిలో రోడ్డులో గోతులు, రోడ్డుపై గోడ ప్రమాదకరంగా ఉన్నప్పటికీ పాలకులు, అధికారుల్లో చలనం లేకపోవడం బాధాకరమన్నారు. తక్షణమే ఆయా రోడ్లలో గోతులు పూడ్చి, రోడ్డుపై ప్రమాదకరంగా ఉన్న గోడను కల్వర్టు నిర్మించి తొలగించాలని కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment