వైసీపీ అధినేత, తన సోదరుడు జగన్‌పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు..
తాజాగా ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు జగన్ ఆయన ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడాన్ని ఆమె నిశితంగా ప్రశ్నించారు.
“అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది జగన్ తీరు” అని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.
అంతేకాదు, అసెంబ్లీ మీద అలగడానికో.. మైకు ఇస్తేనే పోతానని మారాం చేయడానికో కాదు ప్రజలు ఓట్లేసిందన్నారు.తాజాగా ప్రారంభమైన బడ్జట్ సమావేశాలకు వెళ్లబోనని రెండు రోజుల కిందటే జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ప్రకారమే ఆయన, ఆయన పరివారం కూడా సభలకు దూరంగా ఉన్నారు. కనీసం బడ్జెట్ సమావేశాల వైపు తొంగి చూడలేదు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని షర్మిల.. కామెంట్లు కుమ్మరించారు. “ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది” అని వ్యాఖ్యానించారు.
ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అనడం మీ అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనం. హోదా లేకున్నా రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే పలుమార్లు ప్రజా సమస్యలపై తమ గొంతు వినిపించారు. అసెంబ్లీకి వెళ్లే దమ్ము, ధైర్యం లేకుంటే వైసీపీ శాసనసభాపక్షం మొత్తం రాజీనామాలు చేయండి” అని షర్మిల తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. కాగా, వైసీపీ నుంచి ఒక్కరు కూడా.. సభలవైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
మరోవైపు.. సభలో వార్షిక బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. ఈ సమయంలో సభలో ప్రతిపక్ష సీట్లు ఖాళీగా కనిపించాయి. మరోవైపు.. పలువురు సభ్యులు ప్రతిపక్షం వచ్చి ఉండాల్సిందని వ్యాఖ్యానించడం గమనార్హం. సభలో కూర్చున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు ప్రతిపక్ష నాయకుల సీట్ల వైపు పదే పదే చూడడం.. ఎవరైనా వస్తారేమో.. అన్న భావన కలగించింది. కానీ … సభకు ఎవరూ రాకపోవడం గమనార్హం.
వైసీపీ అధినేత, తన సోదరుడు జగన్‌పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు..
by kana bai
Published On: November 11, 2024 11:03 pm