Site icon PRASHNA AYUDHAM

దమ్మాయిగూడలో గండి చెరువు పక్కన అక్రమ రిసార్ట్ నిర్మాణం..!!

IMG 20250703 220647

**దమ్మాయిగూడలో గండి చెరువు పక్కన అక్రమ రిసార్ట్ నిర్మాణం**

*అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్థుల ఆగ్రహం – తక్షణ చర్యల డిమాండ్*

మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ ప్రశ్న ఆయుధం జూలై 3

కీసర మండలం, దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని యాద్గార్‌పల్లి గ్రామంలో అక్రమ నిర్మాణాలపై మరోసారి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామ శివారులోని సర్వే నంబర్ 169లో గండి చెరువు సమీపంలో ఎలాంటి అధికార అనుమతులు లేకుండానే ఓ భారీ రిసార్ట్ నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. నిర్మాణం పూర్తవడానికి ముందే రంగు రంగుల హోర్డింగ్‌లు, కమర్షియల్ ప్రమోషన్‌లు ఊపందుకున్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ నిర్మాణంపై స్థానిక మున్సిపాలిటీ అధికారులు చోద్యుల్లా వ్యవహరిస్తుండటంపై గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఓ పేదవాడు తాను నివసించేందుకు చిన్న గది కట్టినా అనుమతుల పేరుతో ఇబ్బందులు పెడతారు. కానీ ఇక్కడ భారీగా నిర్మాణాలు జరుగుతున్నా ఎందుకు కనబడడంలేదు?” అంటూ మండిపడుతున్నారు.

అక్రమంగా చేపట్టిన ఈ నిర్మాణం ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతోందని, పర్యావరణానికి కూడా ముప్పుగా మారుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల చేతులల్లో ముడుపులు అవుతున్నాయన్న అనుమానాలు నెలకొన్నాయి.

ఈ అంశంపై తక్షణమే దర్యాప్తు జరిపి, అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు దిగుతామని హెచ్చరించారు.

Exit mobile version