స్వస్థ నారీ – సశక్త కుటుంబం కార్యక్రమానికి సమన్వయ సమావేశం
— ఈనెల 17 నుండి దేశవ్యాప్తంగా ప్రారంభం
—మహిళా ఆరోగ్యం, కుటుంబ శక్తీకరణపై దృష్టి
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 16
దేశవ్యాప్తంగా ఈనెల 17 నుండి ప్రారంభమవుతున్న “స్వస్థ నారీ – సశక్త కుటుంబం” కార్యక్రమం కోసం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా అధికారుల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. చంద్రశేఖర్, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్ నాయక్, జిల్లా విద్యా శాఖాధికారి రాజు, గిరిజన సంక్షేమ అధికారి సతీష్, పంచాయతీ అధికారి, యువజన సంక్షేమ శాఖాధికారి వెంకటేష్, ఐఎంఏ ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం ముఖ్యంగా మహిళల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపరిచి కుటుంబాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. మహిళా పోషకాహారం, వ్యాధి నివారణ, గర్భధారణ, మెనోపాజ్ సమయంలో జాగ్రత్తలు, మానసిక ఆరోగ్యం, ఒత్తిడి నిర్వహణ, ఆత్మవిశ్వాసం పెంపొందించటం వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు.
కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శిబిరాలు, ఉచిత వైద్య పరీక్షలు, బీపీ, షుగర్, రక్తపరీక్షలు నిర్వహిస్తారు. అలాగే మాతృశక్తి యోజన, ఆంగన్‌వాడీ సేవలపై ప్రజలకు సమాచారం అందిస్తారు. గర్భిణీలు, తల్లులు, యువతులు, వృద్ధ మహిళలు ప్రధాన లబ్ధిదారులు.
“మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం సశక్తంగా ఉంటుంది. కుటుంబం బలపడితే సమాజం అభివృద్ధి చెందుతుంది” అనే సందేశంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.