బాలల రక్షణ చట్టాలపై అవగాహన పెంచుకోవాలి: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ సౌజన్య

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 14 (ప్రశ్న ఆయుధం న్యూస్): బాలల రక్షణ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, క్రమశిక్షణతో చదువుకుంటే భవిష్యత్తు ఉంటుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ సౌజన్య అన్నారు. కంది మండలం కాశీపూర్ గ్రామంలోని కేజీబీవీ పాఠశాలలో బాలల దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) సెక్రటరీ సౌజన్య హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. జువెనైల్ జస్టిస్ యాక్ట్, పోక్సో యాక్ట్ వంటి బాలల రక్షణ చట్టాల ప్రాముఖ్యతను వివరించారు. చైల్డ్ లేబర్ ప్రమాదాలు, సోషల్ మీడియా వినియోగం, సేఫ్ టచ్ – అన్‌సేఫ్ టచ్ అంశాలపై విద్యార్థులలో అవగాహన పెంచారు. విద్యార్థులు తమ కెరీర్ లక్ష్యాలు స్పష్టంగా నిర్ణయించుకొని క్రమశిక్షణతో విద్యపై దృష్టి పెడితే తప్పకుండా విజయం సాధిస్తారని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె.లలిత కుమారి మాట్లాడుతూ.. ప్రతి బాలిక తనలోని శక్తిని గుర్తించి ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. హెల్ప్‌లైన్ నంబర్లు, బాల్య వివాహాల సమస్యల గురించి అవగాహన కల్పించారు. విద్య ఒక్క అమ్మాయి జీవితానికే కాదు, కుటుంబం మరియు సమాజాభివృద్ధికి మార్గదర్శకమని గుర్తు చేశారు. కార్యక్రమంలో వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కంది మెడికల్ ఆఫీసర్ సాయి శంకర్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ మీరాబాయి, డీసిపియు రత్నం, జిల్లా మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త పల్లవి, చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ యాదగిరి, జెండర్ స్పెషలిస్ట్ విశాల, ఏఎన్‌ఎం, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now