సిద్దిపేట, అక్టోబర్ 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): జర్నలిస్టు దేవులపల్లి భూపతిపై జరిగిన హత్యాయత్నం కేసులో సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల రాష్ట్ర జేఏసీ నేత బత్తుల చంద్రమౌళి డిమాండ్ చేశారు. సిద్దిపేటకు చెందిన డిబిసి తెలుగు న్యూస్ చానల్ జర్నలిస్టు భూపతిపై 6 రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అసలైన నిందితుడైన సిపిఐ నాయకుడు మంద పవన్‌పై పోలీస్‌లు ఇప్పటివరకు ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుపై దాడి జరిపిన ఘటనను తేలికగా తీసుకుని కొందరిపైనే నామమాత్రపు కేసులు పెట్టడం తీవ్ర అన్యాయం అని చంద్రమౌళి అన్నారు. వెంటనే జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ స్పందించి మంద పవన్‌తో పాటు అతని అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి రిమాండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో దళిత జెఏసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్యంపై దాడులేనని, సత్యాన్ని వెలుగులోకి తెచ్చే మీడియాపై ఇటువంటి దారుణ చర్యలను తక్షణమే అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెఏసి రాష్ట్ర నాయకులు గోరటి వెంకటేశం, మాచర్ల రాజయ్య, కరుమూరు శంకర్, గాజుల రమేష్, ముత్యాల రమణయ్య, దాసరి అనిల్ కుమార్, పల్లె జయరాజు, ఇల్లందుల కిరణ్, చింతల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టు భూపతిపై హత్యాయత్నం కేసులో సీపీఐ నాయకుడు మంద పవన్‌పై చర్యలు తీసుకోవాలి: దళిత సంఘాల రాష్ట్ర జేఏసీ నేత బత్తుల చంద్రమౌళి
Oplus_131072