సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లాలో వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన పత్తి రైతులను తక్షణమే ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక సుందరయ్య భవన్ లో ఆయన మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి రైతులు తీవ్రంగా నష్ట పోయారన్నారు. నష్ట పోయిన రైతులకు ఎకరాకు 40వేల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కాపాస్ కిసాన్ యాప్ తో సంబంధం లేకుండా పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేయాలంటే కేంద్రం కాపాస్ యాప్ లో రైతు పంట తదితర వివరాలు నమోదు చేయని పక్షంలో కొనుగోలు కేంద్రాలలో పత్తిని కొనుగోలు చేయమని నిబంధన సరైనది కాదన్నారు. యాప్ పై అవగాహన లేని రైతులు ఎలా నమోదు చేసుకుంటారని ప్రశ్నించారు. యాప్ నమోదు నిబంధనతో సంబంధం లేకుండా వ్యవసాయ అధికారిచే టోకెన్ ద్వారా పత్తి కొనుగోలు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పత్తి కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతు ఆకౌంటులో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో ఇప్పటికే పత్తి పంట తెగుళ్ల బారినపడి రైతులు నష్టపోయి నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తెగుళ్లతో పత్తి రంగు మారిందన్న సాకుతో ప్రవేటు వ్యాపారులు రైతాంగాన్ని దగా చేస్తారని, సిసిఐ అధికారులు రంగు మారిన పత్తికి సైతం కనీస మద్దతు ధర చెల్లించాలన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభం చేయాలని అన్నారు. రైతులను మోసం చేస్తున్న రైస్ మిలర్ల పై చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎం.నర్సిములు, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పత్తి రైతులను ఆదుకోవాలి: సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు
Published On: October 29, 2025 5:01 pm