నటి రేణు దేశాయ్‌కు సంబంధించిన వీడియోపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఒక వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై సైబర్ పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు.
సైబరాబాద్: సోషల్ మీడియాలో అసభ్యకర, దూషణాత్మక వ్యాఖ్యలు పోస్ట్ చేసిన వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. నటి రేణు దేశాయ్‌కు చెందిన వీడియోపై ఇన్‌స్టాగ్రామ్‌లో అభ్యంతరకర కామెంట్ చేసిన కొటిపల్లి వెంకన్న అనే వ్యక్తిని సైబర్ పోలీసులు పట్టుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కొటిపల్లి వెంకన్న అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తుండగా, ఖాళీ సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూసేవాడు. ఈ క్రమంలో నటి రేణు దేశాయ్ వీడియోను చూసి, తన వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభ్యంతరకర వ్యాఖ్యను పోస్ట్ చేశాడు.
సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని మాధాపూర్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి వ్యాఖ్య చేయడానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని విచారణ నిమిత్తం గచ్చిబౌలిలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ, సోషల్ మీడియాలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రజలకు సూచించారు. దూషణాత్మక లేదా అపకీర్తి కలిగించే పోస్టులు చట్టపరమైన చర్యలకు దారితీస్తాయని హెచ్చరించారు. సైబర్ నేరాలకు గురైనవారు 1930 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని తెలిపారు.









