వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను భార్య, ఆమె ప్రియుడు కలిసి అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా పరకాలలో చోటుచేసుకుంది. ఈ నెల 3వ తేదీ నుంచి కనిపించకుండా పోయిన మడికొండ సుమన్ (35) హత్య కేసులో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పరకాలకు చెందిన మడికొండ సుమన్ భార్య లావణ్యకు మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, దీనిపై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని తెలిసింది. ఈ నేపథ్యంలో, భర్తను అడ్డు తొలగించుకోవాలని లావణ్య తన ప్రియుడితో కలిసి పథకం పన్నింది. ఇందుకోసం సుపారీ గ్యాంగ్‌ను కూడా సంప్రదించినట్లు సమాచారం.
ఈ నెల 4వ తేదీన ములుగు జిల్లాలోని దయ్యాలవాగు సమీపంలో సుమన్ పై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ దారుణానికి లావణ్య, ఆమె ప్రియుడు, మరో ఎనిమిది మందితో కూడిన గ్యాంగ్ పాల్పడినట్లు తెలిసింది.
సుమన్ అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో, వారు విచారణ ప్రారంభించారు. విచారణలో భార్య లావణ్య ప్రమేయం బయటపడింది. ప్రస్తుతం లావణ్య, ఆమె ప్రియుడు, ఇతర నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగుతోంది.











