కామారెడ్డి జిల్లా భిక్నూర్ పోలీసులు ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలిపై దాడి చేసి బంగారం దోచుకున్న కేసులో నిందితుడిని కేవలం 24 గంటల్లోనే అరెస్ట్ చేసి, సుమారు 5 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
భిక్నూర్ గ్రామంలోని గాజులపేట గల్లీలో నివసిస్తున్న వృద్ధురాలు ఉప్పరి లచ్చవ్వ ఇంట్లోకి ఏప్రిల్ 12వ తేదీ రాత్రి మాస్క్ ధరించి చొరబడిన గజ్జ స్వామి (54) అనే వ్యక్తి, ఆమెపై దాడి చేసి మెడలోని బంగారు ఆభరణాలను లాక్కెళ్లాడు. ఈ ఘటనపై బాధితురాలి కుమారుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్, ఇతర సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని గుర్తించారు. సోమవారం భిక్నూర్ చర్చ్ గేట్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, నేరాన్ని అంగీకరించాడు.
నిందితుడి నుంచి 50 గ్రాముల (సుమారు 5 తులాల) బంగారంతో పాటు, నేరానికి ఉపయోగించిన బైక్, మొబైల్ ఫోన్, రోకలి బండ, మాస్క్, క్యాప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
నేరస్థులు ఎంత పకడ్బందీగా పథకం వేసినా పోలీసుల నుంచి తప్పించుకోలేరని ఏఎస్పీ హెచ్చరించారు. కేసును అతి తక్కువ సమయంలో ఛేదించిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు.








