నేరాల నియంత్రణలోనూ, శాంతిభద్రతల పరిరక్షణలోనూ సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు, అడిషనల్ డీసీపీ (అడ్మిన్) సూచనల మేరకు బుధవారం టౌన్-1 పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్లాంపూర్, ఖోజా కాలనీ ప్రాంతాల్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టౌన్-1 ఎస్హెచ్ఓ బి. రఘుపతి ఆధ్వర్యంలో సుమారు 70 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ద్వారా ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడంతో పాటు, కొత్త వ్యక్తులు లేదా నేర చరిత్ర కలిగిన వారు కాలనీల్లో ఆశ్రయం పొందుతున్నారా అనే విషయాలను గుర్తించేందుకు అవకాశం ఉంటుందని ఏసీపీ ప్రకాష్ తెలిపారు.
ప్రతి కాలనీలో ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు. సీసీ కెమెరాలు నేరాలను నిరోధించడంలోనే కాకుండా, నేరం జరిగినప్పుడు వాస్తవాలను గుర్తించడం, నిందితులను త్వరగా పట్టుకోవడంలో కూడా ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ఇళ్లను అద్దెకు తీసుకునే కొత్త వ్యక్తుల పూర్తి వివరాలను సేకరించాలని, వారి ఆధార్ కార్డు వంటి గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు.
అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, కొత్తవారు అనుమానాస్పదంగా సంచరిస్తున్నా వెంటనే పోలీసులకు లేదా డయల్-100కు సమాచారం అందించాలని కోరారు. ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారనే విశ్వాసాన్ని పెంపొందించడమే కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. ఇలాంటి తనిఖీలు నిరంతరం నిర్వహించడం ద్వారా నేరాల రేటును తగ్గించి ప్రజలకు మరింత భద్రత కల్పించవచ్చని పేర్కొన్నారు.












