నిజామాబాద్, జూలై 29
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సీఎంఆర్ రూపంలో అప్పగించాల్సిన కొందరు రైస్ మిల్లర్లు భారీ అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వానికి అందాల్సిన బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌కు తరలించి కోట్ల రూపాయలు ఆర్జించినట్లు వెలుగులోకి రావడంతో, సంబంధిత మిల్లులపై చట్టపరమైన చర్యలు ప్రారంభమయ్యాయి.
రైతుల నుంచి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) రూపంలో పౌరసరఫరాల శాఖకు అప్పగించాల్సిన కొందరు రైస్ మిల్లర్లు భారీగా అక్రమాలకు పాల్పడినట్లు అధికారుల తనిఖీల్లో వెలుగుచూసింది. ప్రభుత్వానికి అందజేయాల్సిన బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌కు తరలించి కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించినట్లు గుర్తించిన అధికారులు, సంబంధిత మిల్లులపై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.
గత నాలుగైదేళ్లుగా వివిధ సీజన్లలో ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసినప్పటికీ, నిర్ణీత గడువులో సీఎంఆర్‌ను ప్రభుత్వానికి పూర్తిగా అప్పగించకుండా కొందరు మిల్లర్లు బకాయిలు పేరుకుపోయేలా చేసినట్లు అధికారులు గుర్తించారు. ప్రతి సీజన్ ముగిసిన అనంతరం లెక్కలు తేల్చి సీఎంఆర్‌ను వసూలు చేయాల్సిన పౌరసరఫరాల శాఖ గతంలో సమర్థంగా చర్యలు తీసుకోకపోవడంతో ఈ అక్రమాలు కొనసాగినట్లు సమాచారం.
ఇటీవల పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ అధికారులు జిల్లాలోని పలు రైస్ మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నగర శివారులోని కాలూరులో ఉన్న శ్రీ సిద్ధి రామేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్‌లో 2022-23 యాసంగి నుంచి 2025-26 రబీ సీజన్ వరకు ప్రభుత్వానికి అప్పగించాల్సిన 2,03,688 క్వింటాళ్ల సీఎంఆర్ బకాయిగా ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.66.12 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. ఈ వ్యవహారంలో మిల్లు నిర్వాహకుడు శ్రవణ్‌పై కేసు నమోదు చేశారు.
అదేవిధంగా బోధన్ మండలం సాలూరులోని సాయి లక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్‌లో నిర్వహించిన తనిఖీల్లో సుమారు 19,631 క్వింటాళ్ల సీఎంఆర్ ప్రభుత్వానికి అందజేయకుండా పక్కదారి పట్టించినట్లు తేలింది. దీని విలువ సుమారు రూ.4.31 కోట్లుగా గుర్తించిన అధికారులు ఆ మిల్లుపైనా కేసు నమోదు చేశారు.
జిల్లాలోని మరికొన్ని డిఫాల్ట్ మిల్లులపై కూడా అధికారులు దృష్టి సారించారు. బోధన్ నియోజకవర్గానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధికి సంబంధం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న పలు రైస్ మిల్లుల్లో రూ.58 కోట్లకు పైగా సీఎంఆర్ బకాయిలు ఉన్నట్లు సమాచారం. గతంలో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా తనిఖీలు, చర్యలు ఆశించిన స్థాయిలో జరగలేదనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిఫాల్టర్ రైస్ మిల్లులపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు, సీఎంఆర్ బకాయిల వసూలుతో పాటు అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. అవసరమైతే రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) చట్టం కింద బకాయిల వసూలు, ఆస్తుల జప్తు, బ్యాంకు ఖాతాల స్వాధీనం వంటి చర్యలను కూడా చేపట్టే అవకాశమున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో జిల్లాలో డిఫాల్టర్ రైస్ మిల్లర్లలో ఆందోళన నెలకొంది.










