ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని నాగారం రాంపల్లిలో సర్వే నంబర్ 406 భూమిపై వివాదం తీవ్రమైంది. కోర్టు స్టే అమల్లో ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తూ, అడ్డుకున్న వారిపై దాడి చేశారని బాధితులు ఆరోపించారు.
బాధితుల కథనం ప్రకారం, 2016లో చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూమిని కొందరు వ్యక్తులు తమదిగా చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో బాధితులు కోర్టును ఆశ్రయించగా, వారికి అనుకూలంగా స్టే ఆర్డర్ జారీ అయింది.
అయినప్పటికీ, ఆ వ్యక్తులు రౌడీషీటర్లను వెంటబెట్టుకుని వచ్చి భయపెడుతున్నారని బాధితులు తెలిపారు. సోమవారం, భూమిని జేసీబీతో చదును చేసేందుకు ప్రయత్నించగా, అడ్డుకోవడానికి వెళ్లిన బాధితురాలి భర్తపై సుమారు 20 మంది దాడి చేసి, ఆయన ఫోన్‌ను లాక్కొని కొట్టారని ఆరోపించారు.
కోర్టు ఆదేశాలను ధిక్కరించి భూమిలోకి చొరబడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు రక్షణ కల్పించాలని బాధితులు రాచకొండ పోలీస్ కమిషనర్‌ను కోరారు. ఈ ఆరోపణలపై పోలీసులు విచారణ ప్రారంభించే అవకాశం ఉంది.











