రాష్ట్రంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసిఎస్బి) 'ఆపరేషన్ క్రాక్‌డౌన్ 2.0' పేరుతో విస్తృత నిఘా కార్యక్రమాన్ని చేపట్టింది. గతంలో అరెస్ట్ అయిన నేరగాళ్లు మళ్లీ నేరాలకు పాల్పడకుండా నిరోధించడమే ఈ ఆపరేషన్ లక్ష్యమని డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు.
ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 8 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రత్యేక తనిఖీలు ప్రారంభమయ్యాయి. శాంతిభద్రతల విభాగం పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ శిఖా గోయల్ వెల్లడించారు. సైబర్ నేరాల పట్ల తెలంగాణ పోలీసులు 'జీరో టాలరెన్స్' విధానాన్ని అనుసరిస్తున్నారని ఆమె స్పష్టం చేశారు.
2024-25 సంవత్సరంలో తెలంగాణలో మొత్తం 3,567 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. వీరిలో రాష్ట్రానికి చెందిన 614 మంది ప్రధాన నిందితులపై ప్రస్తుతం ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ తనిఖీల కోసం 300 బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి. నిందితుల ప్రస్తుత నివాసం, వృత్తి, ఆర్థిక లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తున్నారు.
ప్రతి నిందితుడి నివాసాన్ని జియో ట్యాగింగ్ చేయడం ద్వారా వారి కదలికలను నిరంతరం ట్రాక్ చేస్తున్నారు. బెయిల్ నిబంధనలను అతిక్రమించకుండా చూస్తున్నారు. అరెస్టయిన వారిలో మ్యూల్ అకౌంట్ హోల్డర్లు, ఏజెంట్లు, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్ (CSAM) నిందితులు, సైబర్ స్లేవరీకి పాల్పడేవారు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు 335 మందిని భౌతికంగా తనిఖీ చేయగా, వీరికి తెలంగాణలో 480 కేసులు, దేశవ్యాప్తంగా 1,233 కేసులతో సంబంధం ఉన్నట్లు తేలింది.
ఈ క్రమంలో, CSAM కేసులో నిందితుడైన ప్రసాద్ కుమార్ ప్రస్తుతం నేపాల్‌లో ఉన్నట్లు గుర్తించారు. గతంలో అతను సికింద్రాబాద్‌లోని ఒక రెస్టారెంట్లో పనిచేసేవాడని తెలిపారు. ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత కూడా నిందితులు పోలీసుల నిఘాలోనే ఉంటారని, అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే వారిపై 'సస్పెక్ట్ షీట్లు' తెరిచి కఠిన నిఘా ఉంచుతామని శిఖా గోయల్ హెచ్చరించారు. పౌరులను సైబర్ మోసాల నుంచి రక్షించేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని భరోసా ఇచ్చారు.











