జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల నిర్మూలన, పిల్లల భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో సోమవారం నుంచి వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సూచించిన పిల్లల భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలన అనే అంశాలపై ఈ కార్యక్రమాలు దృష్టి సారిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం సంబంధిత ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తామని ఎస్పీ చెప్పారు.
ఈ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా పోలీసు సిబ్బంది అన్ని గ్రామాలకు వెళ్లి, మాదకద్రవ్యాల వాడకం వల్ల కలిగే అనర్థాలు, యువత, పిల్లల భవిష్యత్తుపై వాటి దుష్ప్రభావాల గురించి వివరిస్తారు. మత్తు పదార్థాలకు బానిసై యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవడమే కాకుండా, నేరాలకు పాల్పడుతున్నారని ఎస్పీ ఆందోళన వ్యక్తం చేశారు.
మన పిల్లలను, సమాజాన్ని మాదకద్రవ్యాల బారి నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన నొక్కి చెప్పారు. గంజాయి సరఫరా, వినియోగంపై నిఘా పెంచామని, గతంలో గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్నవారు, వినియోగించే వారిపై పోలీసు నిఘా కొనసాగుతుందని, వారికి అవసరమైన కౌన్సిలింగ్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని తెలిపారు.
మాదకద్రవ్యాల రహిత ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని, అవగాహన కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎస్పీ నరసింహ కోరారు.








