ఉత్తర ప్రదేశ్‌లోని బులందేశ్వర్లో ఒక భర్త, ఇటీవల జరిగిన 'బ్లూ డ్రమ్ హత్య కేసు'ల భయంతో తన భార్యను ఆమె ప్రియుడితో పంపించిన ఘటన వెలుగులోకి వచ్చింది. తన ప్రాణాలకు ముప్పు ఉందని భావించిన భర్త, ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నాడు.
పోలీసుల సమాచారం ప్రకారం, బులందేశ్వర్‌కు చెందిన రాజ్‌కుమార్ భార్యకు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. గతంలో నెల రోజుల పాటు తన చిన్నారిని భర్త వద్ద వదిలి ప్రియుడితో గడిపిన భార్య తీరుపై అనుమానం పెరిగింది. భార్య ఫోన్లో 'సిమెంట్, డ్రమ్ స్టోరీ' పేరుతో హత్యలకు సంబంధించిన కథనాలు, నగ్న చిత్రాలు కనిపించడంతో రాజ్‌కుమార్ భయాందోళనకు గురయ్యాడు.
తనను కూడా అదే రీతిలో హత్య చేస్తారనే భయంతో రాజ్‌కుమార్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీస్ స్టేషన్లో జరిగిన విచారణలో, మహిళ తన భర్త వద్ద ఉండనని, ప్రియుడితోనే వెళ్తానని స్పష్టం చేసింది. దీంతో, తన భద్రత దృష్ట్యా రాజ్‌కుమార్ సమ్మతితో భార్యను ప్రియుడితో పంపించారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 'బ్లూ డ్రమ్ హత్యల' వంటి సంఘటనలు ప్రజల్లో ఎంతటి భయాన్ని కలిగిస్తున్నాయో ఈ సంఘటన తెలియజేస్తోంది.











