హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ పరిధిలో పోలీసులు, టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో భారీ ఎత్తున కుళ్ళిపోయిన మాంసం బయటపడింది. 'A to Z Sheep And Goat Offals' పేరుతో అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్న మొహమ్మద్ అఫ్రోజ్ వద్ద నుంచి 14 టన్నుల కుళ్ళిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మాంసం పలు ప్రముఖ హోటళ్లకు కూడా సరఫరా అయినట్లు అధికారులు గుర్తించారు.
మహానగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న మాంసం వ్యాపారులపై అధికారులు కొరడా విసిరారు. హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ పరిధిలో పోలీసులు, టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో భారీ ఎత్తున కుళ్ళిపోయిన మాంసం బయటపడింది. మొహమ్మద్ అఫ్రోజ్ అనే వ్యక్తి 'A to Z Sheep And Goat Offals' పేరుతో ఈ అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం, నిందితుడు ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి అత్యంత తక్కువ ధరకు పాడైపోయిన గొర్రె, మేక అవయవాలను (లివర్, కిడ్నీ వంటివి) దిగుమతి చేసుకునేవాడు. ఈ మాంసాన్ని నెలల తరబడి డీప్ ఫ్రీజర్లలో, పాడైపోయిన నీరు ఉన్న ప్లాస్టిక్ టబ్బుల్లో నిల్వ ఉంచేవారు. దుర్వాసన రాకుండా రసాయనాలను ఉపయోగించి, ప్రజలకు అది తాజా మాంసం అని నమ్మబలికి విక్రయించేవారు. ఈ దాడుల్లో అధికారులు ఏకంగా 14 టన్నుల కుళ్ళిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ అక్రమ వ్యాపారం కేవలం చిన్న దుకాణాలకే పరిమితం కాలేదని, హైదరాబాద్‌లోని కొన్ని పేరుమోసిన హోటళ్లకు కూడా ఈ మాంసం సరఫరా అయినట్లు విచారణలో తేలింది. మనం రెస్టారెంట్లలో తినే బిర్యానీలు, ఇతర మాంసాహార వంటకాల్లో ఈ కుళ్ళిన మాంసాన్ని ఉపయోగిస్తున్నారన్న వార్త నగరవాసుల్లో తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.
గతంలో కూడా ఇదే వ్యక్తిపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మార్చి 10వ తేదీన జీహెచ్ఎంసీ అధికారులు ఈ వ్యక్తికి జరిమానా విధించినప్పటికీ, అతను తన పద్ధతి మార్చుకోకుండా మళ్లీ అదే వ్యాపారాన్ని కొనసాగించినట్లు వెల్లడైంది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అతడి కోసం గాలిస్తున్నారు. వినియోగదారులు కూడా తాము తినే ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.











