విషం కలిపిన బిస్కెట్లతో సొంత పిల్లలను చంపేందుకు ప్రయత్నించిన తండ్రి, అతని రెండో భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం పొట్టిగుబ్బడి తండాలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. భూ వివాదం నేపథ్యంలో ఈ పథకం రచించినట్లు సమాచారం.
తరిగొప్పుల మండలం ఆంక్షాపూర్ గ్రామానికి చెందిన అనిత, తన ఇద్దరు కుమారులతో (9, 6 సంవత్సరాలు) జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం పొట్టిగుబ్బడి తండాలో నివాసముంటోంది. అనిత భర్త శ్రీనివాస్, ఏడాది క్రితం మూడావత్ మమతను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో, అనిత పోలీసులను ఆశ్రయించడంతో తండా పెద్దమనుషులు పంచాయతీ నిర్వహించారు. పిల్లల పేరిట 20 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని తీర్మానించారు.
భూమిని సాగు చేసుకుంటూ పిల్లల బాగోగులు చూసుకుంటున్న అనితను, ఆ భూమి తనకు ఇవ్వాలని శ్రీనివాస్ వేధించడం ప్రారంభించాడు. మరోసారి పోలీసులను ఆశ్రయించిన అనిత ఫిర్యాదుతో, శ్రీనివాస్ భూమిని దక్కించుకోవాలనే కక్షతో పిల్లలను హత్య చేసేందుకు పథకం రచించాడు. ఇందుకోసం రెండో భార్య మమత సహాయం తీసుకున్నాడు.
స్కూల్‌కు వెళ్లే పిల్లలకు విషం కలిపిన బిస్కెట్లు తినిపించాలని శ్రీనివాస్ ప్లాన్ చేశాడు. ఒక వ్యక్తికి సుపారీ ఇచ్చి, అతని ద్వారా పిల్లలకు బిస్కెట్లు ఇప్పించాలని ప్రయత్నించాడు. అయితే, సుపారీ తీసుకున్న వ్యక్తి మానవత్వంతో వ్యవహరించి, శ్రీనివాస్ కుట్ర గురించి అనితకు తెలియజేశాడు. దీంతో అనిత వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.
పోలీసులు శ్రీనివాస్‌తో పాటు అతని రెండో భార్య మమతను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిందితులపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.











