చిత్తూరు జిల్లా వి.కోటలో ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యకు గురికావడంపై ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ యూనియన్ (APJWU) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన యూనియన్, నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.
APJWU రాష్ట్ర అధ్యక్షులు బూసి మునిబాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఈ హత్యాయాత్నాన్ని తీవ్రంగా ఖండించారు. హత్యకు పాల్పడిన వారిని ఎంతటి వారైనా వదలకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
మృతుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి యూనియన్ తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది. ఈ కష్ట సమయంలో ప్రభుత్వం ఆదుకోవాలని, అన్నివిధాలా సహాయం అందించాలని విజ్ఞప్తి చేసింది.
రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని, న్యాయస్థానాలు పలుమార్లు ఈ దాడులను ఖండించినా ఫలితం లేదని APJWU ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే జర్నలిస్టుల రక్షణ చట్టం తీసుకురావాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బూసి మునిబాబు డిమాండ్ చేశారు.











