కాకతీయ విశ్వవిద్యాలయంలో (కేయూ) చోరీ ఆరోపణలతో మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీవిద్య (20), కేయూలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ రెండో సంవత్సరం చదువుతోంది. హాస్టల్లో కొందరు సీనియర్ విద్యార్థులతో ఆమెకు వివాదం తలెత్తింది. శ్రీవిద్య ల్యాప్ టాప్, బంగారాన్ని దొంగిలించిందని ఆరోపణలు వచ్చాయి.
ఈ ఆరోపణల నేపథ్యంలో, ఈనెల 2వ తేదీన విశ్వవిద్యాలయ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఆ వస్తువులకు సంబంధించిన డబ్బును చెల్లించాలని శ్రీవిద్య తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
పోలీసుల విచారణ అనంతరం, శ్రీవిద్య తన తల్లితో కలిసి సొంతూరికి వెళ్లింది. అక్కడ మనస్తాపానికి గురైన ఆమె, ఈనెల 7వ తేదీన ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తనపై సహచర విద్యార్థులు దాడి చేశారని ఆమె ఒక వీడియోలో పేర్కొన్నట్లు సమాచారం.
తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీవిద్య, చివరకు మృతి చెందింది. ఈ ఘటనపై శ్రీవిద్య తల్లిదండ్రులు మధిర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.










