“డ్రగ్స్ రహిత కామారెడ్డి” లక్ష్యంగా కఠిన చర్యలు చేపట్టాలని, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్లో మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలన (NCORD), రోడ్డు భద్రత అంశాలపై సమగ్ర సమీక్షా సమావేశం జరిగింది.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వ్యాప్తిని అరికట్టడంలో నిర్లక్ష్యం సహించబోమని, ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాపై పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తోందని తెలిపారు. యువతకు అవగాహన కల్పించడానికి సోషల్ మీడియా వేదికలను ఉపయోగించుకోవాలని, విద్యాసంస్థల్లో నిరంతర కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు.
డ్రగ్స్ విక్రయాలు లేదా వినియోగంపై సమాచారం ఉంటే గోప్యత పాటిస్తూ పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కుటుంబాలు, విద్యాసంస్థలు, సమాజం కలిసికట్టుగా పనిచేస్తేనే ఈ సమస్యను నిర్మూలించవచ్చని ఎస్పీ అభిప్రాయపడ్డారు.
రోడ్డు భద్రతపై మాట్లాడుతూ, 2024లో 276 మంది మృతిచెందగా, 2025లో ఈ సంఖ్య 225కు తగ్గినప్పటికీ, ప్రమాదాల సంఖ్యను మరింత తగ్గించే దిశగా చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. ప్రమాదకర మలుపుల వద్ద స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు, రాత్రిపూట స్పష్టత కోసం రిఫ్లెక్టివ్ రేడియం స్ట్రిప్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
సమావేశంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, జిల్లా పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. రోడ్ల మరమ్మతులు కూడా వెంటనే చేపట్టాలని సూచించారు.












