కామారెడ్డి జిల్లాలో ప్రేమ వ్యవహారానికి సంబంధించిన విషాద ఘటన చోటుచేసుకుంది. హరిజనవాడకు చెందిన జంగేటి రూపేష్ కుమార్ (19) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. యువతి కుటుంబ సభ్యులు తనను బెదిరించడమే ఆత్మహత్యకు కారణమని రూపేష్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
కామారెడ్డి సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం, డెకరేషన్ పనులు చేసుకునే రూపేష్, గత మూడు సంవత్సరాలుగా క్యాసంపల్లి గ్రామానికి చెందిన ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తాయి.
ఈ నెల 25న ఉదయం, యువతి సోదరుడు కాంపల్లి వంశీ, అతని స్నేహితుడు కళ్యాణ్ కలిసి రూపేష్‌ను కలవడం, 'మా చెల్లితో మాట్లాడొద్దు, ఎందుకు బతుకుతున్నావ్, చావచ్చుగా' అని తీవ్రంగా బెదిరించడమే కాకుండా దాడికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.
ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన రూపేష్, అదే రోజు మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
రూపేష్ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.











