కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న చంద్రశేఖర్ సతీమణి దివ్య (28) ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మంగళవారం నాడు దివ్య ఇంట్లో గన్నేరు పప్పును సేవించినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, చికిత్స ఫలించక ఆమె తుదిశ్వాస విడిచారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కడుపునొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ, దీనిపై పోలీసులు ఇంకా నిర్ధారణకు రాలేదు.
టూ టౌన్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులను విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఈ విషాదకర సంఘటనతో ఎస్సై చంద్రశేఖర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.










