కూకట్పల్లి, జేఎన్టీయూ పరిధిలోని గోపాల్ నగర్ ULC భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న సామాన్యులు, చిరుద్యోగులు 'హైడ్రా' అనే పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న కబ్జాదారుల బారిన పడ్డారు. ఇటీవల కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, కొందరు వ్యక్తులు ఈ భూములపై కన్నేసి, వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు ఆరోపించారు.
సుమారు 20-30 ఏళ్ల క్రితం ULC భూముల్లో ప్లాట్లు కొనుగోలు చేసి, చిన్న చిన్న ఇళ్లు నిర్మించుకున్న బాధితులు, దశాబ్దాల న్యాయపోరాటం అనంతరం కోర్టు తీర్పుతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ తీర్పుతోనే వారి కష్టాలు తీరలేదని, ఇప్పుడు 'హైడ్రా' పేరుతో కొందరు వ్యక్తులు తమను బెదిరిస్తున్నారని బాధితులు వాపోయారు.
బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తులు, తాము ఈ స్థలంలో అభివృద్ధి చేపట్టి, హైరైజ్డ్ బిల్డింగులు నిర్మిస్తామని, అందులో ప్లాట్లు ఇస్తామని చెబుతూ, ప్రస్తుతం ఉన్న ఇళ్ల యజమానులను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు తెలిపారు. వారి డిమాండ్లకు ఒప్పుకోకపోతే, 'హైడ్రా'ను పంపి ఇళ్లు కూల్చేస్తామని, ప్రభుత్వ స్థలంగా బోర్డులు పెట్టిస్తామని హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో, 'హైడ్రా' పేరుతో తమను వేధిస్తున్న భూ రాబందులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులను, అధికారులను కోరుతున్నారు. న్యాయస్థానం తీర్పు తమకు అనుకూలంగా వచ్చినప్పటికీ, కబ్జాదారుల వేధింపుల వల్ల తాము అభద్రతాభావంతో జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేయాలని కోరారు.











