కురవి మండలంలో మైనర్ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో బాలికను వంచించి, బెదిరింపులకు పాల్పడటమే ఈ విషాదానికి కారణమని దర్యాప్తులో తేలింది.
కురవి ఎస్సై గండ్రాతి సతీష్ కథనం ప్రకారం, ఈ నెల 14వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మైనర్ బాలిక, చికిత్స అనంతరం 18వ తేదీన మృతి చెందింది. మరణానికి ముందు ఇచ్చిన వాంగ్మూలంలో బానోత్ కిరణ్ అనే వ్యక్తి తన మృతికి కారణమని బాలిక పేర్కొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో, నిందితుడు బాలికకు బంధువే అయినప్పటికీ, మారుపేర్లతో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకుని, తాను కళాశాల విద్యార్థినని నమ్మించి ప్రేమ పేరుతో వంచించినట్లు తేలింది. నిందితుడికి ఇప్పటికే వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్న విషయం దాచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు.
బాలిక నిందితుడికి దూరంగా ఉండటానికి ప్రయత్నించినప్పుడు, నిందితుడు కాల్ రికార్డింగ్‌లను బయటపెడతానని, పరువు తీస్తానని బెదిరించినట్లు సమాచారం. ఈ బెదిరింపుల ఒత్తిడితోనే బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు.
నిందితుడు గతంలో POCSO కేసులో శిక్ష పడిన వ్యక్తికి బెయిల్ ఇప్పిస్తానని రూ.12 లక్షలు తీసుకున్నట్లు, గోల్డ్ చైన్ స్నాచింగ్ కేసులో కూడా ప్రమేయం ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.










