నెలకు అధిక వడ్డీ ఆశ చూపిస్తూ పెట్టుబడిదారులను మోసం చేసిన ముగ్గురు వ్యక్తులను నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు సుమారు 290 మంది నుంచి 30 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు సమాచారం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బండ్లగూడ ఆనంద్ నగర్‌కు చెందిన కిచ్చ వీరభద్రరావు (51), అతని భార్య రాజ్యలక్ష్మి, సహాయకుడు వెంకట దుర్గాప్రసాద్ కలిసి నాగోల్ డివిజన్లోని కో-ఆపరేటివ్ బ్యాంక్ కాలనీలో "వీరభద్ర ట్రేడింగ్" పేరుతో కార్యాలయం ప్రారంభించారు. లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి నెలకు రూ.10 వేల చొప్పున వడ్డీ చెల్లిస్తామని వీరు హామీ ఇచ్చారు.
ఈ క్రమంలో సుమారు 290 మంది వినియోగదారులు 30 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. మొదట్లో కొంతమందికి వడ్డీ చెల్లిస్తూ నమ్మకం కల్పించిన నిందితులు, ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. 2025 మే నెలలో గుర్గాంలో వీరభద్రరావుపై సైబర్ క్రైమ్ కేసు నమోదు కావడంతో వీరి కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది.
అప్పుల భారంతో రూ.30 కోట్లలో రూ.15 కోట్లు మాత్రమే తిరిగి చెల్లించి, మిగతా మొత్తాన్ని నిలిపివేశారు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించగా, వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
అధిక లాభాల ఆశకు లోనవకుండా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పోలీసులు సూచించారు. ఈ మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.











