నిజామాబాద్ జిల్లాలో అక్రమ మొరం తవ్వకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు, చీతా ఫోర్స్ బృందం కమ్మర్పల్లి మండలం బషీరాబాద్ వద్ద మెరుపు దాడి నిర్వహించి, అక్రమంగా మొరం తవ్వకాలకు వినియోగిస్తున్న ఒక జేసీబీ, మొరాన్ని తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుంది.
సీసీఎస్ ఏసీపీ ఇన్చార్జి మస్తాన్ అలీ పర్యవేక్షణలో నిఘా నిర్వహిస్తున్న చీతా ఫోర్స్‌కు బషీరాబాద్ సమీపంలోని కాడి చెరువు వద్ద అక్రమ మొరం తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం అందింది. వెంటనే స్పందించిన పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా, తవ్వకాలకు వినియోగిస్తున్న జేసీబీ, మొరాన్ని తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
అధికారుల కథనం ప్రకారం, ఈ అక్రమ తవ్వకాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలగడంతో పాటు, పర్యావరణ సమతుల్యతకు కూడా భంగం కలుగుతోంది. ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను తదుపరి విచారణ కోసం కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ మొరం, ఇసుక, మట్టి తవ్వకాలు, రవాణాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ప్రజలు అక్రమ కార్యకలాపాలను గమనిస్తే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.










