గుజరాత్లోని సూరత్ నగరంలో పట్టపగలు జరిగిన ఒక దుశ్చర్యలో, వరాచా ప్రాంతంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖలో దుండగులు తుపాకులు చూపి బ్యాంకు సిబ్బందిని బెదిరించి రూ.50 లక్షల నగదును దోచుకెళ్లారు.
ఈ దోపిడీ నేటి మధ్యాహ్నం జరిగినట్లు తెలిసింది. దుండగులు ముందుగా బ్యాంకులోని అలారం వ్యవస్థను నిర్వీర్యం చేసి, ఆపై బ్యాంకు సిబ్బంది ఫోన్లను లాక్కున్నారు.
సిబ్బందిని బెదిరించి, క్యాష్ కౌంటర్లలో ఉన్న సుమారు రూ.50 లక్షల నగదును దోచుకుని పారిపోయినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనతో బ్యాంకులో తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దొంగలను పట్టుకోవడానికి దర్యాప్తు ప్రారంభించారు.
దొంగల గుర్తింపు కోసం సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.











