మహిళా వేధింపుల కేసును మాఫీ చేస్తానని చెప్పి లంచం డిమాండ్ చేసిన ఏఎస్సై బాలయ్యను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కోర్టు ప్రాంగణంలో రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేశారు. ఈ ఘటన మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంది.
చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న బాలయ్య, ప్రస్తుతం కోర్టు డ్యూటీలో ఉన్నారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో నమోదైన ఒక మహిళా వేధింపుల కేసును లోక్ అదాలత్ లో మూసివేయించాలంటే 15,000 రూపాయలు లంచంగా ఇవ్వాలని కేసులో నిందితుడైన పల్లపు రాంబాబుని బాలయ్య డిమాండ్ చేశాడు.
ఏఎస్సై వేధింపులకు విసిగిపోయిన రాంబాబు, ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రాంబాబు ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వల పన్ని, బుధవారం కోర్టు ప్రాంగణంలో లంచం తీసుకుంటుండగా బాలయ్యను అరెస్ట్ చేశారు.
అరెస్ట్ అనంతరం బాలయ్యను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. కోర్టు ప్రాంగణంలోనే లంచం తీసుకుంటూ పట్టుబడటం కలకలం రేపింది. ఈ ఘటన ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతిపై ఏసీబీ నిఘా కొనసాగుతోందని మరోసారి స్పష్టం చేసింది.











