వట్టినాగులపల్లిలో సుమారు 300 కోట్ల రూపాయల విలువైన భూముల విషయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు తమను బెదిరించారని, దాడి చేశారని బాధితురాలు పల్లవి షా తీవ్ర ఆరోపణలు చేశారు. తమ భూమిని వదిలి వెళ్లకపోతే చంపి పాతిపెడతామని బెదిరించారని ఆమె తెలిపారు.
పల్లవి షా కథనం ప్రకారం, దీపావళి నుంచి తాము భయంతో జీవిస్తున్నామని, తమ ఇంటికి వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. భూమిని తమకు అప్పగించాలని ఒత్తిడి చేశారని, అందుకు నిరాకరించడంతో గుండాలతో బెదిరించారని ఆమె పేర్కొన్నారు.
2021లో తాము భూమిని సర్వే చేసుకుని గోడలు నిర్మించుకున్నామని, అయితే 70 మందికి పైగా గుండాలు జేసీబీలతో వచ్చి తమ గోడలను కూలగొట్టారని, సిబ్బందిపై దాడి చేశారని ఆమె వివరించారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, దాడి తీరు సినిమా తరహాలో ఉందని ఆమె ఆరోపించారు.
గచ్చిబౌలి పోలీస్ ఆఫీసర్ హబీబ్ తమకు న్యాయం చేసి, రక్షణ కల్పించారని అయితే, ఆ తర్వాత ఆయన్ను అక్కడి నుంచి బదిలీ చేసి, తమ గోశాలను తొలగించారని తెలిపారు. దీంతో తమ ఆవులు రోడ్డుపైకి వెళ్లాయని, ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఆమె వాపోయారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ తమపై దాడులు జరుగుతున్నాయని పల్లవి షా అన్నారు.
ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని, తమ భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ ఆరోపణలపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గం నుంచి ఎటువంటి స్పందన రాలేదు.







