ఎరువుల పిడుగు

పిడుగు
Headlines
  1. డీఏపీ ధరల పెంపుతో రైతులకు మరింత భారమైన యాసంగి సీజన్.
  2. బ్లాక్ మార్కెట్ దందా: డీఏపీ కొరతలో రైతుల అగచాట్లు.
  3. ఎరువుల నిల్వలు లేక రైతులపై పెరిగిన విపత్కర ప్రభావం.
  4. రైతు సంఘాల డిమాండ్: డీఏపీ ధరల భారాన్ని కేంద్రం భరించాలి.
  5. వ్యవసాయ శాఖ వైఫల్యం: యాసంగి సాగు కష్టకాలంలో.
– బస్తా ధర రూ.1350 నుంచి రూ.1650కి పెంపుదల

– రాష్ట్రవ్యాప్తంగా డీఏపీ భారం రూ.100 కోట్లు

– నిల్వలు అంతంతమాత్రమే..

– బ్లాక్‌ మార్కెట్‌లో వ్యాపారుల విక్రయాలు

– కేంద్రం వైఖరిపై అన్నదాతల ఆగ్రహం

– ఎరువుల ధరలు తగ్గించాలి : రైతు సంఘం

ఆరుగాలం కష్టపడి పండించే పంటలకు గిట్టుబాటు ధర పెరగట్లేదు. కానీ..! ఎరువులు, డీజిల్‌ ఇతర వస్తువుల ధరలు మాత్రం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. యాసంగి సీజన్‌లో డీఏపీ ధరలు విపరీతంగా పెరగడంతో అన్నదాతలపై భారాలు భారీగానే పడనున్నాయి. ఏటేటా సాగు వ్యయం పెరగడం వల్ల రైతులు నష్టాల పాలవుతున్న పరిస్థితి ఉంది. బస్తా డీఏపీపై రూ.300 ధర పెరగడంతో రైతులపై వందల కోట్ల భారం పడనుంది. మరోపక్క డీఏపీ ఎరువుల ధరలు పెరగడంతో బ్లాక్‌ మార్కెట్‌ పెరిగింది. పాత సరుకును కొత్త ధరలకు అమ్ముతూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. యాసంగి సీజన్‌కు సరిపడా ఎరువుల్ని స్టాక్‌ చేయాల్సిన మార్క్‌ఫెడ్‌, వ్వవసాయ శాఖలు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నాయి.

యాసంగి సీజన్‌లో విశాఖ, అనురాధ కార్తెలు ముగిసేలోపు వరి నార్లు పోస్తారు. డిసెంబర్‌ 15 నుంచి వరినాట్లు షురూ అవుతాయి. ఆరుతడి పంటలు సైతం ఇదే సమయంలో సాగవుతాయి. ఇప్పటికే బోర్లు, బావుల కింద సాగు చేసే వరి పంటలకు సంబంధించి నార్లు పోసే పనులు ప్రారంభమవ్వగా ఇతర మెట్ట పంటల సాగుకు దుక్కుల్ని సిద్దం చేస్తున్నారు. యాసంగి సీజన్‌లో వరి, మొక్కజొన్న, కూరగాయలు, పండ్లతోటలు, చెరకు వంటి పంటల సాగులో ఎరువుల్ని వివనియోస్తారు. అందులో డీఏపీ ఎరువు వాడకం అధికంగా ఉంటుంది. సీజన్‌ ప్రారంభానికి ముందే డీఏపీ ఎరువుల ధరలు పెరగడంతో రైతుల నెత్తిన పిడుగు పడినట్టయింది. ఇప్పటికే యాసంగీ సీజన్‌ సాగు ప్రణాళికల్ని వ్వయసాయ శాఖ ప్రకటించింది. ఆయా పంటల వారీగా సాగు విస్తీర్ణానికి అవసరమైన విత్తనాలు, ఎరువుల్ని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

యాసంగి ప్రణాళికలు

రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్‌లో వివిద రకాల పంటలు కలిపి 63.34 లక్షల ఎకరాల్లో సాగవ్వనున్నట్టు అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే 3.15 లక్షల ఎకరాల్లో వివిద పంటలు సాగైనట్టు కూడా అధికారుల రికార్డుల్లో పేర్కొన్నారు. ఇందులో వరి పంట విస్తీర్ణమే అధికంగా ఉంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో సైతం వివిధ రకాల పంటలు కలిపి 8.35 లక్షల ఎకరాల్లో సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. మెదక్‌ 3.33 లక్షల ఎకరాలు, సిద్దిపేట జిల్లాల్లో 3.20 లక్షల ఎకరాల్లో వివిద పంటలు సాగవ్వనున్నాయి. రెండు జిల్లాల్లో సాగునీటి వనరులు, బోర్ల ద్వారా నీటి లభ్యత ఉన్నందున వరి పంట సాగు అధికంగా ఉండనుంది. సంగారెడ్డి జిల్లాలో 1.82 లక్షల ఎకరాల్లో పంటలు సాగవ్వనున్నాయి. బోర్లు, సింగూరు ప్రాజెక్టు కింద నీటి లభ్యత ఉన్నందున వరి పంట 1.2 లక్షల ఎకరాల్లో సాగవ్వనుంది. ఇప్పటికే ఖరీఫ్‌ వరి కోతలు, ఇతర పంటలు చేతికొచ్చినందున రైతులు యాసంగి సీజన్‌ సాగు పనుల్లోకి దిగారు. వరి నార్ల కోసం దుక్కలు దున్ని విత్తనాలు సిద్దం చేసుకుంటున్నారు.

డీఏపీ బస్తాపై రూ.300 భారం

ఉన్నట్లుండి యాసంగి సీజన్‌కు ముందే డీఏపీ ఎరువు బస్తా ధర ఏకంగా రూ.300 పెంచారు. ఇప్పటి వరకు డీఏపీ బస్తా ధర రూ.1350 ఉండగా ప్రస్తుతం రూ.1650కి పెరిగింది. యాసంగీ సీజన్‌లో వరి, పండ్ల తోటలు, ఇతర పంటల సాగు కోసం యూరియా, డీఏపీ, కాంప్లెక్స్‌, సింగిల్‌ సూపర్‌ ఫాస్పెట్‌, మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ వంటి ఎరువుల్ని వినియోగిస్తారు. రాష్ట్రంలో 1.50 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు డీఏపీ ఎరువుల్ని వివిధ పంటల సాగులో వినియోగిస్తారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో డీఏపీ ఎరువు 20 వేల మెట్రిక్‌ టన్నుల వరకు వినియోగిస్తారు. మార్కెట్‌లో డీఏపీ ధరలు విపరీతంగా పెరగడంతో డీఏపీ బస్తా కొనాలంటే రైతులకు గుండె దడ పుడుతోంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 4 లక్షల డీఏపీ బస్తాల్ని వినియోగిస్తారు. ఆ లెక్కన బస్తాకు రూ.300 చొప్పున ఉమ్మడి మెదక్‌ జిల్లా రైతాంగంపై రూ.12 కోట్ల భారం మోపబడుతుంది. రాష్ట్రంలోనూ 30 లక్షల బస్తాల వరకు డీఏపీని వినియోగిస్తున్నారు. బస్తాకు రూ.300 చొప్పున భారం పడినందున రూ.90 కోట్ల వరకు రైతులు భరించాల్సి ఉంటుంది. సగటున రాష్ట్ర రైతాంగంపై కేవలం డీఏపీ ఎంపీఆర్‌( గరిష్ట రిటైల్‌ ధర) ప్రకారం కొనుగోలు చేసినా రూ.100 కోట్ల వరకు అదనపు భారం పడుతుండడంతో యాసంగి సాగు కష్టకాలంగా మారనుంది.

మార్కెట్‌లో నిల్వల్లేవు… బ్లాక్‌ మార్కెటింగ్‌

యాసంగి సీజన్‌ సాగు పనులు జరుగుతున్నా మార్కెట్‌లో అవసరమైన ఎరువుల నిల్వలు కనిపిస్తలేవు. ఎరువులకు నోడల్‌ ఏజెన్సీగా వ్యవహారించే మార్క్‌ఫెడ్‌, వ్యవసాయ శాఖల ద్వారా ఎరువుల పంపిణీ చేస్తారు. ఫర్టిలైజర్‌ వ్యాపారులు, రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు విక్రయిస్తారు. వాస్తవంగా యాసంగి సీజన్‌కు అవసరమైన ఎరువుల్ని ముందే బఫర్‌ స్టాక్‌ ఉంచాలి. నవంబర్‌లో 65 వేల మెట్రిక్‌ టన్నుల డీఏపీ ఎరువుల్ని స్టాక్‌ నిల్వ ఉంచాల్సి ఉండగా ప్రస్తుతం 12 వేల మెట్రిక్‌ టన్నులు కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉంది. దేశ వ్యాప్తంగా కూడా డీఏపీ కొరత నెలకొనడంతో రాష్ట్రంలోనూ అదే పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవంగా అక్టోబర్‌లో 30 వేల మెట్రిక్‌ టన్నులు, నవంబర్‌లో 40 వేల మెట్రిక్‌ టన్నులు, డిసెంబర్‌లో 35 వేలు, జనవరిలో 30 వేల మెట్రిక్‌ టన్నుల వరకు నిల్వలు ఉంచి రైతులకు కొరత లేకుండా చూడాల్సిన మార్క్‌ఫెడ్‌, వ్వవసాయ శాఖలు నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్నాయి. ఎరువుల వినియోగాన్ని బట్టి ముందే ఇండెంట్‌ పెట్టి స్టాక్‌ తెప్పించి స్థానికంగా ఏర్పాటు చేసిన రేక్‌ పాయింట్లలో నిల్వ ఉంచి స్థానిక అవసరాల్ని బట్టి పంపిణీ చేయాలి. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న కొద్దిపాటి నిల్వల్ని కూడా వ్యాపారులు బ్లాక్‌ చేసి పాత స్టాక్‌ను పెరిగిన ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. నిల్వలు లేక, ఉన్నా ధరలు పెరగడంతో రైతుకు డీఏపీ దొరకడమే గగనంగా మారుతోంది.

డీఏపీ భారం మోపొద్దు: రైతు సంఘాలు 

డీఏపీ ధరలు పెరగడం వల్ల రైతులు నష్టపోనున్నారు. ఇప్పటికే సాగు వ్యయం విపరీతంగా పెరిగింది. డీజీల్‌, ఎరువులు, విత్తనాల ధరలు పెంచుతున్నారు. రైతులు పండించే పంటలకు మాత్రం కేంద్రం గిట్టుబాటు ధరల్ని ఖరారు చేసి మద్దతు ధరలుగా ప్రకటించడంలేదు. న్వామినాథన్‌ కమిషన్‌, ఇతర కమిషన్లు చేసిన సూచనలేవీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. పెంచిన డీఏపీ ఎరువు ధరల భారాన్ని రైతులపై వేయకుండా కేంద్రం భరించాలి. బ్లాక్‌ మార్కెట్‌ను అరికట్టి రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment