రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధుల జమకు డేట్ ఫిక్స్!!
తెలంగాణలో రైతుభరోసా నిధుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రూ.2లక్షల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం.. రైతుభరోసా అములకు కూడా సిద్ధం అయ్యిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు రైతుల ఖాతాల్లో ఎప్పుడు రైతుభరోసా నిధులు జమ అవుతాయనే చర్చ జరుగుతోంది. కాగా.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులుకు రైతు భరోసా నిధులు జులైలోనే అందాల్సి ఉంది. కానీ.. వివిధ కారణాల వల్ల జాప్యమవుతూ వస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. దసరా కానుకగా రైతు భరోసా నిధులు విడుదల చేయాలని సర్కారు యోచిస్తున్నట్టు సమాచారం. అక్టోబర్ 12న దసరా పండగ ఉన్న నేపథ్యంలో.. అదే రోజున నిధులను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఈ విషయంపై రైతులు చాలా వరకు సంతోషం వ్యక్తం చేస్తున్నా.. మార్గదర్శకాలు ఎలా ఉంటాయనే దానిపై ఆందోళన కూడా చెందుతున్నారు.
రైతు భరోసా నిధులు అందరికీ ఇవ్వబోము అని గతంలో చాలా సార్లు ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎవరెవరికి నిధులు జమ చేస్తారనేది తెలియాల్సి ఉంది. మరోవైపు చిన్న, సన్నకారు రైతులకే ప్రయోజనం కలిగించేలా కటాఫ్ విధిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరి.. ఆ కటాఫ్ ఎంత ఉండనుంది? ఎన్ని ఎకరాల భూమి ఉన్న వారికి రైతు భరోసా నిధులు అందుతాయి? అనే విషయాలపై స్పష్టం రావాల్సి ఉంది. ఈ నెలాఖరులోపు స్పష్టత వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా కింద పెట్టుబడి సాయంగా రూ.15వేలు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. మరి పెంచిన డబ్బును ఇస్తారా? లేదా గత ప్రభుత్వం ఇచ్చిన సాయాన్ని కంటిన్యూ చేస్తారా అని ఉత్కంఠ కొనసాగుతోంది..