Headlines :
-
తల్లిదండ్రుల ప్రేమకు ప్రతిబింబం కూతురు – ఆడపిల్లల హక్కులపై హైకోర్టు కీలక తీర్పు
-
పెళ్లైన తర్వాత కూడా కుటుంబంలో భాగమే – ఆడపిల్ల హక్కులపై స్పష్టత
-
కూతురి హక్కుల పట్ల కుటుంబం బాధ్యత – కారుణ్య నియామకంపై హైకోర్టు తీర్పు
-
ఆడపిల్లల హక్కుల సాధికారతలో ముందడుగు – హైకోర్టు తీర్పు విశేషాలు
ఉదయమెప్పుడూ/ కూతురు లానే/ అందంగా, ఆప్యాయంగా వస్తుంది/ ఉన్నంతసేపూ ఉత్సాహమే/ చీకటిలో కూరుకు పోకుండా/ చంద్రుడ్ని వెలిగించి/ లోనున్న నక్షత్రాల్ని బయటకులాగి/ కనుమరుగవుతున్న సూర్యుడిలా/ తనింటికి అమ్మాయి” అంటారో కవి. అమ్మ ఎంత కష్టమైనా తనే పడుతుందిగానీ.. కూతురికి పని చెప్పదు. కూతురంటే అంత మురిపెం. భార్య ఎంత కష్టపడుతున్నా చూసీచూడనట్లుండే భర్త… కూతురు చిన్న పనిచేసినా తట్టుకోలేడు. భార్య బిర్యానీ చేసినా చిన్న కాంప్లిమెంట్ కూడా ఇవ్వడుగానీ, కూతురు మ్యాగీ చేసినా… అదో గిన్నిస్‌బుక్ రికార్డులా గొప్పగా చెప్పుకుని సంతోషపడతారు పిచ్చినాన్నలు. ఏ కష్టం తన కూతురి దరిచేరనివ్వని అడ్డుగోడ నాన్నయితే, కూతురు మనసులోని కష్టాన్ని కూడా కనిపెట్టి… భరోసానిచ్చేది, నీడలా నిలిచేది అమ్మ. అందుకే ఏ ఇంట్లోనైనా గారం చేసేది, మారాం పెట్టేది కూతురే. కూతురికి ప్రేమను పంచడంలో రాజు-పేద తేడా వుండదు. జార్ఖండ్‌లో ఓ వ్యక్తి కూతురికి అంగరంగ వైభవంగా వివాహం చేస్తాడు. ఏడాదికూడా గడవకుండానే అత్తింటి వేధింపులు భరించలేని కూతురి కన్నీళ్లు చూడలేకపోతారు. వివాహం ఎంత ఘనంగా చేశారో అంతే ఘనంగా అత్తింటి నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకొస్తారు. తమ కుమార్తెకు విముక్తి కలిగిందని సంబరాలు చేసుకుంటారు. అందరు తల్లిదండ్రులు ఇంత సాహసం చేయలేకపోవచ్చుగాని… ఇంతకంటే ఎక్కువ మానసిక క్షోభనైతే అనుభవిస్తారు.
వివాహమైనా…కాకున్నా-కుటుంబంతో పెనవేసుకున్న బంధం ఆడపిల్లది. తల్లిదండ్రుల కుటుంబంలో కొడుకుతోపాటు కూతురు కూడా ఎప్పటికీ భాగమే. చాలా కుటుంబాల్లో వివాహం కాగానే… ఆ కుటుంబంతో తనకేమీ సంబంధం లేదని, చుట్టం చూపుగా రావడం మినహా మరేమీ సంబంధం లేదన్నట్లు వుంటుంది. కానీ, ఇదంతా తప్పని… ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల స్పష్టం చేసింది. జగదీష్ అనే వ్యక్తి విజయవాడ దుర్గామల్లేశ్వర దేవస్థానంలో స్వీపర్‌గా పనిచేస్తూ 2013లో మరణించారు. కారుణ్య నియామకం కింద తండ్రి ఉద్యోగం తనకివ్వాల్సిందిగా ఆయన కుమార్తె దేవస్థానం ఈవోకు వినతిపత్రం సమర్పించారు. రకరకాల కారణాలు చూపిన అధికారులు స్పందించకపోగా, ఆమె అభ్యర్థన తిరస్కరిస్తున్నట్లు 2018లో ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 2021లో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల… ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి… వివాహిత కుమార్తె కారుణ్య నియామకానికి అర్హురాలని స్పష్టం చేశారు. ‘కారుణ్య నియామక పథకం అమలులో వివాహం చేసుకున్న కుమార్తెల విషయంలో వివక్ష చూపేలా షరతులు విధించడం చట్టవిరుద్ధం. వివాహమైన కుమారుడి విషయంలో లేని అనర్హత, వివాహమైన కుమార్తె విషయంలో చూపడం వివక్షే. పెళ్లయినా, కాకపోయినా… కుమార్తె, కుమారుడు జీవితాంతం తల్లిదండ్రుల కుటుంబంలో భాగమే. పెళ్లి కారణంతో కుమార్తెను ఆమె తల్లిదండ్రుల కుటుంబంలో సభ్యురాలు కాదనడం దుర్మార్గం’ అని జస్టిస్ మన్మధరావు తీర్పులో పేర్కొన్నారు.
ప్రతి తల్లీదండ్రీ తమ కుమార్తెలను అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. ఆడంబరంగా వివాహం చేస్తారు. అయితే, జీవిత భాగస్వామి, కుటుంబం ఆమె పట్ల తప్పుగా ప్రవర్తిస్తే… అక్కడే వుండి బాధలుపడి, చివరికి ప్రాణాలు తీసుకుంటే… దానికి బాధ్యులు ఎవరు? అలాంటి పరిస్థితిలో అమ్మాయిలు గౌరవంగా తమ పుట్టింటికి తిరిగొచ్చే అవకాశం వుండాలి. పురుషాధిక్య సమాజం సృష్టించిన అంతులేని అణచివేత, వివక్ష… ఆడపిల్ల హక్కులను, స్వేచ్ఛను హరించివేసింది. ‘అవనిలో సగం… ఆకాశంలో సగం’ అని ఎన్ని కబుర్లు చెప్పినా, గర్భం దాల్చడం, అబార్షన్ తన హక్కు అని అమెరికా ఎన్నికల్లో సైతం చర్చ నడుస్తోన్నా, పెదాలు పలికే పదాలు…ఆచరణలో అవహేళనకు గురవుతున్నాయి. ఆడపిల్ల అని గర్భ విచ్ఛిత్తికి పాల్పడుతున్న వారినీ చూస్తున్నాం. ‘కంటే కూతుర్నే కనాలి రా/ మనసుంటే మగాడిలా పెంచాలి రా’ అంటారో సినీ కవి. కొడుకే కాదు… కుమార్తె కూడా తన తల్లిదండ్రుల కుటుంబంలో ఎప్పటికీ భాగమే. ‘మగకీ ఆడకీ/ శీలాన్నీ, ఆస్తినీ/ సమంగా వర్తింపించండి’ అంటారు కవయిత్రి రేవతీదేవి. ఆడపిల్లల హక్కుల పట్ల సానుకూలంగా, సాధికారంగా స్పందించాలి. ఆ దిశగా ఈ తీర్పు ఒక ముందడుగు.