రెవెన్యూ పెండింగ్ దరఖాస్తులు యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించండి:
కలెక్టర్ ఆదేశాలు
భూభారతి, ప్రజావాణి, సర్టిఫికెట్ జారీ, ఇసుక అక్రమ రవాణాపై సమీక్ష
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ( ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 16
జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సంబంధిత దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన భూభారతి, రెవెన్యూ సదస్సులు, సీఎం ప్రజావాణి, కలెక్టర్ ప్రజావాణి దరఖాస్తులు, సర్టిఫికెట్ జారీ, ప్రభుత్వ భూముల సర్వే, రేషన్ కార్డుల పంపిణీ, ఇసుక–మొరం అక్రమ రవాణా వంటి 16 అంశాలపై సమీక్ష జరిపారు. భూభారతి చట్టం ప్రకారం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని, ఫారెస్ట్ భూముల వివాదాలను సంబంధిత అధికారులతో సమన్వయంగా పరిష్కరించాలన్నారు. కొత్త గ్రామపాలన అధికారులు, శిక్షణ పొందిన సర్వేయర్లను వినియోగించుకోవాలని సూచించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, డిఆర్ఓ మధు మోహన్, ఆర్డీవో పార్థసింహారెడ్డి, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.