*హైదరాబాద్‌లో డీలిమిటేషన్ సమావేశం..*
హైదరాబాద్: డీలిమిటేషన్ పై ఏప్రిల్ 14న హైదరాబాద్‌లో సమావేశం జరగనుంది. నియోజకవర్గాల పునర్ విభజనపై తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో డాక్గర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజున సమావేశం జరగనుంది. భావ సారుప్యత కలిగిన రాష్ట్రాలు, నాయకులు, సామాజిక కార్యకర్తలను ఆహ్వానించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఏప్రిల్ 14న సమావేశం తర్వాత పరేడ్ గ్రౌండ్స్‌లో బహింగ సభ నిర్వహిస్తారు. జనాభా ప్రాతిపదికన లోక్ సభ నియోజకవర్గాల పునర్ విభజన జరిగినట్లు అయితే దక్షిణాది రాష్ట్రాలు పూర్తిగా నష్టపోతాయని, ఉత్తరాదిన ఉన్న కొన్ని రాష్ట్రాలు కూడా నష్టపోతాయి. ఈ క్రమంలో ఈ అంశంపై సానుకూలంగా పార్టీలు, ఆ పార్టీల అగ్రనేతలు, ముఖ్యమంత్రులను హైదరాబాద్ సమావేశానికి పిలవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అంతేకాకుండా వివిధ రంగాలకు చెందిన మేధావులను కూడా పిలవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. మరి ఈ సమావేశానికి బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ వస్తారా.. రారా.. అన్నది సందిగ్దం.. కాగా డీలిమిటేషన్ పై రెండో సమావేశం తెలంగాణలోని హైదరబాద్‌లో నిర్వహిస్తామని నిన్న (శనివారం) చెన్నైలో జరిగిన డీలిమిటేషన్ సమావేశంలో తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు.
పునర్విభజన ప్రక్రియపై తమ రాష్ట్ర శాసన సభలో త్వరలోనే తీర్మానం ఆమోదిస్తామని, తమ తరహాలోనే మిగిలిన రాష్ట్రాల్లోనూ తీర్మానం చేయాలని సహచర ముఖ్యమంత్రులు, ఇతర నేతలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పునర్విభజనపై తదుపరి సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తానని, పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడంపై అప్పుడు చర్చిద్దామని ప్రతిపాదించారు. ఈ పోరాటంలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తానని, దక్షిణాదిలోని ప్రతి ఒక్కరూ హక్కుల రక్షణకు కలిసి రావాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాదిని గౌరవిస్తాం.. దక్షిణాది హక్కుల విషయంలో రాజీ పడం..
దక్షిణాది రాష్ట్రాల హక్కుల విషయంలో రాజీ పడబోమని సీఎం రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్‌పై చెన్నైలో జరిగిన సమావేశానికి హాజరైన సీఎం దీనిపై ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘ఈ పుణ్యభూమి అంబేద్కర్ మహనీయుడు రాసిన రాజ్యాంగం వల్ల సమాఖ్య స్ఫూర్తిని, సామాజిక న్యాయాన్ని, సమాన హక్కులను పొందింది. రాజ్య విస్తరణ కాంక్ష, రాజకీయ ప్రయోజన ఆకాంక్షతో డీలిమిటేషన్‌ను అస్త్రంగా ప్రయోగించి వీటిని విచ్ఛిన్నం చేస్తామంటే మౌనంగా ఉండలేం. ఉత్తరాదిని గౌరవిస్తాం.. దక్షిణాది హక్కుల విషయంలో రాజీపడం’’ అని స్పష్టం చేశారు. ఈ ధర్మ పోరాటానికి చెన్నై శ్రీకారం చుట్టిందని, న్యాయం జరిగే వరకు, ధర్మం గెలిచే వరకు హైదరాబాద్ ఆకారం ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.