డెంగ్యూ డేంజర్‌ బెల్స్‌!

*_డెంగ్యూ డేంజర్‌ బెల్స్‌!_*

వానకాలం ముంగిట పొంచిఉన్న ముప్పు

ఏటేటా పెరుగుతున్న డెంగ్యూ కేసుల సంఖ్య

నిరుడు రికార్డుస్థాయిలో 10,077 నమోదు

పరిశుభ్రత పాటించాలి

ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు

హైదరాబాద్‌, మే 18 వానకాలం ముంగిట డెంగ్యూ డేంజర్‌ బెల్స్‌ మోగుతున్నాయి. ఏటేటా డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిరుడు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 10,077 డెంగ్యూ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 2023లో 8,016, 2022లో 8,972 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో డెంగ్యూపై అవగాహన పెంచుకోవడం ద్వారా వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చని వైద్యు లు సూచిస్తున్నారు. వానకాలంలో డెంగ్యూ కేసుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే రాష్ర్టాలకు ఆదేశాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా డెంగ్యూ మరణాలు పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం డెంగ్యూ నివారణకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్రప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖకు సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం డెంగ్యూ నివారణకు చర్యలు ప్రారంభించింది. శుక్రవారం జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి, ప్రజలు డెంగ్యూ పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

*_ఈడిస్‌ దోమ కారణం_*

ఈడిస్‌ దోమ కుట్టడం ద్వారా డెంగ్యూ జ్వరానికి కారణమయ్యే వైరస్‌ వ్యాపిస్తుంది. ఈడిస్‌ దోమ పగటిపూటే ఎక్కువగా కుడుతుంది. తిరిగి బల్లల కింద, కప్‌ బోర్డుల్లో, దుస్తుల మధ్యలోకి వెళ్లి దాక్కుంటుంది. అసలు ఇంట్లోకి దోమలే రాకుండా చూసుకోవడం మేలు. ఇది కుడితే సాధారణంగా చర్మంపై ఎర్ర మచ్చలు, తలనొప్పి, కీళ్ల నొప్పులు, అధిక జ్వరానికి దారితీస్తుంది. అంతర్గత రక్తస్రావం కారణంగా కొన్ని సందర్భాల్లో డెంగ్యూ ప్రాణాంతకంగా మారుతుంది. డెంగ్యూ హెమరేజిక్‌ జ్వరం మరణానికి కారణమవుతుంది. వృద్ధులు, పిల్లలు, బలహీనమైన రోగనిరోధకశక్తి ఉన్నవారికి డెంగ్యూతో ఎక్కువ హాని ఉంటుంది.

*_కంచర్లలో ఒకరికి డెంగ్యూ_*

వీర్నపల్లి, మే 17: రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామంలో డెంగ్యూ కేసు నమోదైంది. గ్రామంలోని ఒడ్డెరకాలనీకి చెందిన ఓ వ్యక్తి వారం రోజుల నుంచి జ్వరంతో బాధపడుతుండగా వైద్య సిబ్బంది రక్త పరీక్షల కోసం ఎల్లారెడ్డిపేటలోని సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు చేయగా డెంగ్యూ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సదరు వ్యక్తిని ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

*_డెంగ్యూతో అప్రమత్తంగా ఉండాలి_*

డెంగ్యూతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను గుర్తించి వాటిని తొలగించాలి. వారానికి ఒక్కరోజైనా ఇంటిలోపల, బయట నిల్వ నీరు ఉన్నదా? లేదా? అని చెక్‌ చేసి చూసుకోవాలి. వానకాలం సమీపిస్తున్నందున చిన్నపిల్లల తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలి. తలుపులు, కిటికీలకు దొమతెరలు బిగించుకోవాలి. అధిక జ్వరం, తలనొప్పి, వెన్నునొప్పి, కీళ్లనొప్పులు, శరీరంపై ఎర్ర మచ్చలు, కొన్ని సందర్భాల్లో ముక్కులోంచి రక్తం రావడం, చిన్నారులు చాలా నిరసంగా, చికాకుగా ఉండటం, విపరీతంగా పొట్ట నొప్పి, వాంతుల వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

Join WhatsApp

Join Now