ప్రతి విద్యార్థి పాఠశాలలో ఉండేలా చర్యలు తీసుకోండి: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలు

ప్రతి విద్యార్థి పాఠశాలలో ఉండేలా చర్యలు తీసుకోండి: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలు

‘బెస్ట్ అవైలబుల్ స్కీం’ అమలుపై కలెక్టర్లతో సమీక్ష

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం అక్టోబర్ 14

ప్రజా ప్రభుత్వం విద్యారంగాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుందని, ఏ విద్యార్థి కూడా పాఠశాల మానేయకుండా ఉండేలా జిల్లా కలెక్టర్లు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు.

మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి ఉప ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ‘బెస్ట్ అవైలబుల్ స్కీం ’ పురోగతిపై ఆయన సమీక్షించారు.

విద్యార్థులను బయటికి పంపడానికి వీల్లేదు

“బెస్ట్ అవైలబుల్ స్కీం కింద పాఠశాల యాజమాన్యాలు, జిల్లా యంత్రాంగం మధ్య నిధులకు సంబంధించిన ఒప్పందం ఇప్పటికే జరిగింది. నిధుల ఆలస్యంపై విద్యార్థులను బయటకు పంపడం సరైంది కాదు. ఇబ్బందులు ఉంటే యాజమాన్యాలు జిల్లా అధికారులను సంప్రదించాలి,” అని విక్రమార్క స్పష్టం చేశారు.

కలెక్టర్లు, డీఈవోలు, సంక్షేమ శాఖల అధికారులు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని, పథకం కింద ఎంపికైన ప్రతి విద్యార్థి చదువులో అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు.

బకాయిల వివరాలు వెంటనే పంపండి

పాఠశాలల వారీగా ఉన్న బకాయిల వివరాలను వెంటనే పంపించాలని ఉప ముఖ్యమంత్రి కలెక్టర్లను ఆదేశించారు. బకాయిల్లో కొంత మొత్తాన్ని త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. విద్యా, వైద్య రంగాలపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

మూతపడ్డ పాఠశాలలపై విచారణ

నిధుల ఆలస్యంతో కొన్ని పాఠశాలలు మూతపడ్డాయని సమాచారం అందిందని, “నిధులపై మాత్రమే ఆధారపడితే అవి ‘బెస్ట్ స్కూల్స్’ ఎలా అవుతాయి?” అని విక్రమార్క ప్రశ్నించారు.

డీఈవోలు వెంటనే పాఠశాలలను సందర్శించి విద్యార్థుల సంఖ్య, నిబంధనల అమలు, వసతుల పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

విద్యార్థుల వివరాలు సేకరించాలి

గడచిన ఏడు సంవత్సరాలలో ఈ పథకం కింద చదివిన విద్యార్థుల వివరాలను సేకరించాలని, వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు, ఉన్నత విద్యలో కొనసాగుతున్నారా వంటి వివరాలు కూడా తెలుసుకోవాలని సూచించారు.

సమీక్షలో పాల్గొన్న అధికారులు

ఈ సమీక్షలో విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి యోగితా రానా, సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీ బుద్ధ ప్రకాశ్, కమిషనర్ క్షితిజ పాల్గొన్నారు.

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ రాధిక గుప్తా, డీఈవో విజయకుమారి తదితరులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment