రాంపల్లిలో హనుమాన్ విగ్రహం ధ్వంసం – గ్రామస్థుల ఆగ్రహం ఉధృతం
మేడ్చల్ కీసర ప్రశ్న ఆయుధం అక్టోబర్ 17:
కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లి గ్రామంలో హనుమాన్ విగ్రహం ధ్వంసం ఘటనతో స్థానికుల ఆగ్రహం ఉధృతమైంది. గ్రామంలోని రామాలయం వద్ద ఉన్న పురాతన హనుమాన్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన గురువారం తెల్లవారుజామున వెలుగుచూసింది.సమాచారం అందుకున్న కీసర పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అయితే, దేవాలయం సమీపంలోని కెమెరాలు పనిచేయడం లేదని పోలీసులు చెప్పడంతో గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామస్థులు మాట్లాడుతూ, “మా గ్రామంలోని ఈ హనుమాన్ విగ్రహం చాలా పురాతనమైనది. కొందరు గాలివల్ల విగ్రహం విరిగిపోయిందని చెబుతున్నా, ఇది ఉద్దేశపూర్వక ధ్వంసమే” అని అన్నారు. “పోలీసులు సమగ్ర విచారణ జరిపి, దోషులను వెంటనే పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పందిస్తూ, వెంటనే రాంపల్లి చేరుకుని విగ్రహాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, “ఇది అత్యంత దారుణమైన ఘటన. నిందితులు ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తప్పనిసరి” అని హెచ్చరించారు.అదే విధంగా గ్రామస్థులు, యువజన సంఘాలు మరియు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కలిసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు ఎసీపీ వెంకట్ రెడ్డికి వినతిపత్రం సమర్పించి, హనుమాన్ విగ్రహం ధ్వంసం చేసిన వారిని వెంటనే గుర్తించి శిక్షించాలని కోరారు.