లోక కల్యాణం కోసం భద్రాచలంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ ఘనస్వాగతం పలికారు.
ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దంపతులు కళ్యాణ వేడుకను తిలకించడానికి విచ్చేసిన సందర్భంగా, ఆలయ అధికారులు వారికి పూర్ణకుంభాలతో స్వాగతం పలికారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం తనకు దక్కిన అదృష్టమని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ, శ్రీరామ నవమి పర్వదినాన జరిగే ఈ కళ్యాణ మహోత్సవం రాష్ట్ర ప్రజలందరికీ ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని చేకూర్చాలని ఆకాంక్షించారు. రామయ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన అభిలషించారు.
శ్రీరామ నవమి పర్వదినం పురస్కరించుకుని భద్రాచలం క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. కళ్యాణ వేడుకలకు ప్రభుత్వం తరపున అవసరమైన అన్ని ఏర్పాట్లను మంత్రులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.











