కామారెడ్డి జిల్లా, తాడ్వాయి మండలం పరిధిలోని కన్కల్, తాడ్వాయి, కృష్ణాజివాడి గ్రామాలలో గ్రామ దేవతలకు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ప్రతి ఏటా ఆషాడ మాసంలో ఈ పండుగను గ్రామస్తులు ఘనంగా నిర్వహిస్తారు.
గ్రామస్తులు ఏకమై అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు కొత్త కుండలలో అన్నం, పాలు, బెల్లంతో బోనాలు వండి, పసుపు, కుంకుమ, వేప ఆకులతో అలంకరించి, తలపై పెట్టుకుని ఊరేగింపుగా ఆలయాలకు చేరుకున్నారు.
ఆలయాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, బోనాలతో పాటు పట్టు వస్త్రాలు, గాజులు సమర్పించారు. గ్రామస్తులు గ్రామ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.
ఈ వేడుకలలో డప్పు వాయిద్యాలు, పోతరాజు విన్యాసాలు, శివ సొత్తుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కోరిన కోరికలు తీర్చే దేవతలుగా భావించే నల్ల పోచమ్మ, నాయకమ్మ, ముత్యాలమ్మ, బంగారు మైసమ్మ అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. పాడిపంటలు, పశువులు, పిల్ల పాపలు సుఖసంతోషాలతో ఉండాలని, వర్షాలు సకాలంలో కురవాలని గ్రామస్తులు అమ్మవారిని వేడుకున్నారు.








