భారత ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మరియు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు.
ఉపరాష్ట్రపతి ఆలయానికి చేరుకోగానే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, సి.వి.ఎస్.ఓ. మురళీకృష్ణలు ఆయనకు స్వాగతం పలికారు. అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఆయనకు ఇస్తికఫాల్ స్వాగతం అందించారు.
ధ్వజస్తంభానికి నమస్కరించుకున్న అనంతరం ఉపరాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని కూడా దర్శించుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన శ్రీ బేడి ఆంజనేయస్వామివారిని కూడా దర్శించుకున్నారు.
శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఉపరాష్ట్రపతికి వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మరియు ఈవోలు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను ఉపరాష్ట్రపతికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరిజవహర్‌లాల్, టీటీడీ బోర్డు సభ్యులు రామమూర్తి, భాను ప్రకాష్ రెడ్డి, జంగా కృష్ణమూర్తితో పాటు పలువురు రాష్ట్రస్థాయి మరియు జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.











