మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని రంగంపేట గ్రామంలో శ్రీ భూనీలా సమేత రంగనాయక స్వామి పంచాహ్నిక కళ్యాణ, రథోత్సవ వేడుకలు మూడు రోజులుగా వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా మంగళవారం స్వామి వారి కళ్యాణం కమనీయంగా జరిగింది.
ఆలయ మండపంలో రంగనాయక స్వామి, లక్ష్మీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి, తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన వేద పండితుల ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛరణల మధ్య, భక్తుల గోవింద నామాలతో కళ్యాణ వేడుకలు నిర్వహించారు.
కళ్యాణం అనంతరం భక్తులు అమ్మవార్లకి, స్వామివారికి ఓడిబియ్యాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి, అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాత్రి స్వామివారికి భక్తులు హనుమంత వాహన సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో గ్రామ సర్పంచ్ అరిగె స్వర్ణలత విజయ్ కుమార్, ఆలయ అభివృద్ధి సమితి సభ్యులు, పలువురు భక్తులు పాల్గొన్నారు.












