సంత్ శిరోమణి సంత్ రవిదాస్ మహారాజ్ 650వ జయంతి ఉత్సవాల సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో క్యాలెండర్, పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సంత్ రవిదాస్ బోధనలను స్మరించుకున్నారు.
ఎంపీ, కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ, సంత్ రవిదాస్ ఆధ్యాత్మిక గురువుగా సమాజానికి మార్గదర్శకుడని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మాట్లాడుతూ, సమరసత కోసం ఆయన చేసిన కృషి అపారమని కొనియాడారు.
సామాజిక సమరసత అఖిల భారత కళావిభాగం కన్వీనర్ అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ, రవిదాస్ బోధించిన సమానత్వం, మానవత్వం నేటి సమాజానికి అత్యంత అవసరమని అన్నారు. కులమత భేదాలకు అతీతంగా సమాజ నిర్మాణం చేయాలని పిలుపునిచ్చారు.
రవిదాస్ భక్తి ఉద్యమంలో స్వామి రామానంద శిష్యుడిగా, కబీర్ దాస్ సహచరుడిగా ఆధ్యాత్మిక విప్లవం నడిపిన మహనీయుడని అప్పాల ప్రసాద్ వివరించారు. సిక్కుల ఆరాధ్య గ్రంథం గురు గ్రంథ సాహెబ్ లో రవిదాస్ పద్యాలు పొందుపరచబడినట్లు పేర్కొన్నారు.
కృష్ణభక్తురాలు మీరాబాయి కూడా రవిదాస్ ను గురువుగా భావించి సేవించిందని గుర్తుచేశారు. ఫిబ్రవరి 2026 నుంచి జనవరి 2027 వరకు దేశవ్యాప్తంగా జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వివిధ విభాగాల ప్రతినిధులు, మోచి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


