కీసర మండలం రాంపల్లిదాయర పరిధిలోని వెంకలోనిగుట్టపై వెలసిన హేమాద్రి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్న విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్, జవహర్‌నగర్ ఏసీపీ చక్రపాణి, కీసర సీఐ ఆంజనేయులతో కలిసి ఆలయ ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లు, బందోబస్తును పరిశీలించారు.
పోలీసు అధికారులు ఆలయ ఆవరణం, క్యూలైన్లు, స్వామివారి కల్యాణం నిర్వహించే ప్రదేశం, అన్నదాన వితరణ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వాహనాల పార్కింగ్‌కు కేటాయించిన ప్రదేశాలను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు.
ప్రతిష్ఠా మహోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రతాపరమైన చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని డీసీపీ సూచించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కందాడి హనుమంత్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులతో సమావేశమైన డీసీపీ, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, పోలీసు సిబ్బంది మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.











